టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్? అనౌన్స్‌మెంట్‌కు బీసీసీఐ రెడీ.. ఎప్పుడంటే?-bcci ready to announce shubman gill as india test team captain on may 23rd or 24th for england series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్? అనౌన్స్‌మెంట్‌కు బీసీసీఐ రెడీ.. ఎప్పుడంటే?

టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్? అనౌన్స్‌మెంట్‌కు బీసీసీఐ రెడీ.. ఎప్పుడంటే?

రోహిత్ రిటైర్మెంట్ తో భారత టెస్టు టీమ్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. గిల్ కు టెస్టు పగ్గాలు అప్పజెప్పేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఈ నెలలోనే ఇందుకు ముహూర్తం పెట్టినట్లు తెలిసింది.

శుభ్‌మన్ గిల్ (AFP)

భారత టెస్టు క్రికెట్ టీమ్ కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. యంగ్ ఆటగాడికే బీసీసీఐ పట్టం కట్టబోతోంది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భారత టెస్టు పగ్గాలు అందుకోబోతున్నాడని సమాచారం. సెలక్షన్ కమిటీ టెస్ట్ క్రికెట్‌లో తదుపరి భారత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ రెండు వారాల్లో ప్రకటన చేయనుంది. అదే రోజున, ఇంగ్లాండ్‌లో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు టీమిండియాను కూడా సెలెక్టర్లు ప్రకటించనున్నారు.

రోహిత్ రిటైర్మెంట్ తో

రోహిత్ శర్మ మే 7న టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్ పర్యటనకు జట్టులో అతని స్థానం గురించి చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతను హఠాత్తుగా ప్రకటన చేయడంతో కెప్టెన్సీ స్థానం ఖాళీ అయింది. చాలా మంది నిపుణులు జస్ప్రీత్ బుమ్రాను సారథిగా ఎంపిక చేస్తారని భావించారు. గత నవంబర్‌లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ లో భారత్‌కు ఏకైక విజయాన్ని అందించిన వైస్ కెప్టెన్ బుమ్రాను కాదని కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్‌ను సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు సమాచారం.

పట్టాభిషేకం ఎప్పుడంటే?

దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. గిల్ టెస్ట్ కెప్టెన్‌గా మే 23 లేదా 24న బాధ్యతలు చేపట్టనున్నాడు. దీనికి సంబంధించి బీసీసీఐ విలేకరుల సమావేశం నిర్వహించనుంది. 23 ఏళ్ల ఈ ఆటగాడు ఇప్పటికే భారత జట్టులోని కొందరు సభ్యులను కలిశాడు. గిల్ ఇప్పటికే వైట్-బాల్ ఫార్మాట్‌లలో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2024 నుంచి ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.

ఇంగ్లాండ్ తో సిరీస్

ఐపీఎల్ 2025 తర్వాత ఇంగ్లాండ్ లో టీమిండియా పర్యటించనుంది. ఆ సిరీస్ జూన్ 20న స్టార్ట్ అవుతుంది. ఈ ఇంగ్లాండ్ టూర్ కోసం జట్టును ప్రకటించే రోజునే గిల్ కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పనున్నారని టాక్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల్లో టెస్టు సెంచరీలు చేసిన రిషబ్ పంత్ టెస్టు టీమ్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశముందని పీటీఐ తెలిపింది.

గాయాలతో ఇబ్బందిపడుతున్న బుమ్రా కు వైస్ కెప్టెన్సీ ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని తెలిసింది. ఇంగ్లాండ్ తో సిరీస్ లో అతను అన్ని మ్యాచ్ లూ ఆడేది అనుమానమే. "బుమ్రా కెప్టెన్ కాకపోతే, అతనికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడంలో అర్థం లేదు" అని బీసీసీఐ వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి.

రాహుల్ కూడా

కేఎల్ రాహుల్ కూడా వైస్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. కానీ అతను ఇప్పటికే 33 ఏళ్లు పైబడ్డాయి. ఇక ఆస్ట్రేలియాలో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ అతని నిలకడలేమి సమస్యగా మారింది. 11 సంవత్సరాల టెస్ట్ కెరీర్ తర్వాత, అతను 50 మ్యాచ్‌లలో 35 కంటే తక్కువ సగటును కలిగి ఉన్నాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం