విరాట్ కోహ్లి టెస్టు రిటైర్మెంట్ అంశంలో రోజుకో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్తానని బీసీసీఐకి కోహ్లి చెప్పాడనే వార్త కలకలం రేపింది. అయితే ఇప్పుడే రిటైర్మెంట్ వద్దని కోహ్లి మనసు మార్చేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పుడు అసలు విరాట్ కోహ్లీకి టెస్టు టీమ్ లో ప్లేస్ లేదని, అతని రిటైర్మెంట్ ఆలోచన మార్చుకోవాలని బీసీసీఐ రిక్వెస్ట్ చేయడం లేదని ఓ రిపోర్ట్ వెల్లడించింది.
దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం కోహ్లీని తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని బీసీసీఐ అడగలేదని తెలిసింది. విరాట్ కోహ్లి పేలవ ఫామ్ కారణంగా భారత టెస్ట్ జట్టులో అతనికి స్థానం లేదని బీసీసీఐ టాప్ అఫీషియల్స్ స్పష్టంగా చెప్పారని సమాచారం. ఇటీవలి ఫామ్ కారణంగా టీమిండియా టెస్టు జట్టులో కోహ్లికి ప్లేస్ లేదని అతనికే చెప్పారని దైనిక్ జాగరణ్ పేర్కొంది.
ఆస్ట్రేలియాతో చివరగా టీమిండియా ఆడిన టెస్టు సిరీస్ లో అయిదు మ్యాచ్ ల్లో కలిసి విరాట్ 190 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. అతను పెర్త్‌లో తన 30వ టెస్ట్ సెంచరీని సాధించాడు. ఆసీస్‌పై అతనికి అది 9వ టెస్ట్ సెంచరీ. అంతకంటే ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కోహ్లి ఆరు ఇన్నింగ్స్‌లలో 15.50 సగటుతో 93 పరుగులు చేశాడు.
"బీసీసీఐ ఎవరినీ అభ్యర్థించదు. ఒక ఆటగాడి నిర్ణయం అతని వ్యక్తిగత ఎంపిక. మేము దానిలో జోక్యం చేసుకోం" అని బీసీసీఐ ప్రతినిధి చెప్పినట్లు జాగరణ్ పేర్కొంది. భారత్ 0-3 తేడాతో న్యూజిలాండ్ చేతిలో సిరీస్ వైట్ వాష్, ఆ తర్వాత ఆసీస్ లో సిరీస్ ఓటమి, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరకపోవడాన్ని బీసీసీఐ సీరియస్ గా తీసుకుంది.
అందుకే మే 7న ముంబయిలో జరిగిన సమావేశంలో రోహిత్‌కు భారత టెస్ట్ జట్టులో స్థానం లేదని చెప్పారని తెలిసింది. కోహ్లీకి కూడా అదే మెసేజ్ అందించారని సమాచారం.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కొత్త సైకిల్ ఈ ఏడాది స్టార్ట్ అవుతుంది. ఇందులో ఫస్ట్ గా ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడుతోంది. ఈ సైకిల్ 2027 వరకు ఉంటుంది. అప్పటివరకూ రోహిత్, కోహ్లి టెస్టుల్లో కొనసాగడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అందుకే 38 ఏళ్ల రోహిత్, 36 ఏళ్ల కోహ్లీని కాదని యంగ్ క్రికెటర్లపై బీసీసీఐ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలికాడు. అనూహ్యంగా నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ బీసీసీఐ ఈ విషయాన్ని రోహిత్ కు స్పష్టంగా చెప్పిందని తెలిసింది. ఇప్పుడు కోహ్లి కూడా అదే బాటలో సాగే అవకాశముంది.
సంబంధిత కథనం