BCCI Awards: బీసీసీఐ అవార్డులు.. సచిన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్.. బుమ్రా బెస్ట్ ప్లేయర్.. అశ్విన్‌కు స్పెషల్ అవార్డు
BCCI Awards: బీసీసీఐ అవార్డులు ప్రకటించింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు. ఇక ఈ మధ్యే రిటైరైన అశ్విన్ కు స్పెషల్ అవార్డు దక్కనుండగా.. బుమ్రా బెస్ట్ మేల్ ప్లేయర్ గా నిలిచాడు.
BCCI Awards: బీసీసీఐ శనివారం (ఫిబ్రవరి 1) ఇవ్వబోతున్న వార్షిక నమన్ అవార్డుల్లో ఈ మధ్యే రిటైరైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను స్పెషల్ అవార్డుతో సత్కరించనుంది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతున్న సమయంలోనే గతేడాది డిసెంబర్ లో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక బీసీసీఐ అవార్డుల్లో సచిన్ టెండూల్కర్ కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కనుండగా.. బుమ్రా బెస్ట్ మేల్ ప్లేయర్ గా అవార్డు అందుకోనున్నాడు.

బీసీసీఐ అవార్డులు ఇలా..
బీసీసీఐ వార్షిక అవార్డుల విజేతలను శుక్రవారం (జనవరి 31) అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా బెస్ట్ మేల్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డును పేస్ బౌలర్ బుమ్రాకు ఇవ్వనున్నారు. దీంతో అతడు పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకోబోతున్నాడు. ఇక మహిళల్లో స్మృతి మంధానా బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఫిమేల్ అవార్డును అందుకోనుంది.
సర్ఫరాజ్ ఖాన్, ఆశా శోభనలకు మెన్స్, వుమెన్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ అవార్డులు దక్కనున్నాయి. గతేడాది అత్యధిక వికెట్లు తీసుకున్న ఫిమేల్ ప్లేయర్ దీప్తి శర్మకు కూడా అవార్డు దక్కనుంది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇవ్వనున్నారు. గతంలో ఈ అవార్డు అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, బిషన్ సింగ్ బేడీ, వెంకటరాఘవన్, ప్రసన్న, చంద్రశేఖర్, మొహిందర్ అమర్‌నాథ్, ఫరూఖ ఇంజినీర్ లాంటి వాళ్లకు దక్కింది. ఈ అవార్డుల సెర్మనీ శనివారం (ఫిబ్రవరి 1) ముంబైలో జరగనుంది.
తనూష్ కొటియన్, శశాంక్ సింగ్ లకు అవార్డులు
ముంబై ఆల్ రౌండర్ తనూష్ కొటియన్ కు 2023-24 సీజన్ రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్ రౌండర్ గా లాలా అమర్ నాథ్ అవార్డును అందుకోనున్నాడు. మరోవైపు, 2023-24 సీజన్లో అన్ని పరిమిత ఓవర్ల పోటీల్లో ఉత్తమ ఆల్ రౌండర్ గా నిలిచినందుకు శశాంక్ సింగ్ లాలా అమర్‌నాథ్ అవార్డుకు ఎంపికయ్యాడు.
ఇండోర్‌కు చెందిన అక్షయ్ తోత్రే 2023-24 సీజన్‌కు దేశవాళీ క్రికెట్లో ఉత్తమ అంపైర్ అవార్డును అందుకోనున్నాడు. 2023-24 సీజన్లో బీసీసీఐ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌ను సన్మానించనుంది.
2023-24 సీజన్లో ముంబై టీమ్ రంజీ ట్రోఫీ, అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీ, అండర్-14 వెస్ట్ జోన్ ఛాంపియన్షిప్, సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ, మహిళల అండర్-19 వన్డే ట్రోఫీ, పురుషుల అండర్-19 ఆలిండియా టోర్నమెంట్లను గెలుచుకుంది.
సంబంధిత కథనం