బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ ఇంకా క్రిటికల్ కండీషన్ లోనే ఉన్నాడు. ఈ మాజీ కెప్టెన్ కు రాబోయే మరో 2-3 రోజులు కీలకం. ఢాకా ప్రీమియర్ లీగ్ లో మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షైన్ పుకుర్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ గుండెపోటుకు గురయ్యాడు.
క్రిక్ బజ్ ప్రకారం బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కు యాంజియోగ్రామ్ సక్సెస్ గా నిర్వహించారని తెలిసింది. అతని గుండె ధమనులలో ఒకదానిలో బ్లాక్ ను తొలగించడానికి యాంజియోగ్రామ్ నిర్వహించారు. తమీమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అబు జాఫర్ మంగళవారం (మార్చి 25) అప్ డేట్ ఇచ్చారు. తమీమ్ సాధారణ స్థితికి రావడానికి మూడు నెలలు పడుతుందని చెప్పారు.
‘‘తమీమ్ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. కాస్త నడక ప్రారంభించాడు. అయితే రాగల 48 నుంచి 72 గంటలు అత్యంత కీలకం కానున్నాయి. క్రీడలతో సహా సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అతను కనీసం మూడు నెలలు వేచి ఉండాలి’’ అని ప్రొఫెసర్ అబు జాఫర్ తెలిపారు. ఎకోకార్డియోగ్రామ్ సానుకూల సంకేతాలను చూపుతోందని నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ అబ్దుల్ వదూద్ ధృవీకరించారు.
"అతని గుండె పనితీరు సాధారణంగా కనిపిస్తుంది, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. అసాధారణ లయలు ఇంకా సంభవించవచ్చు" అని వదూద్ చెప్పారు.
తమీమ్ ఇక్బాల్ ఇటీవల ఫేస్ బుక్ లో ప్రతి ఒక్కరి సందేశాలు, ప్రేమకు ధన్యవాదాలు తెలిపాడు. "హార్ట్ బీట్ కారణంగానే జీవిస్తాం. కానీ ఈ హృదయ స్పందన ఎటువంటి సంకేతం లేకుండా ఆగిపోతుంది. నిన్న నాకు ఏం జరిగిందో తెలుసా? అల్లా దయ, అందరి ఆశీస్సులతో తిరిగి కోలుకుంటున్నా. ఇలాంటి కష్ట సమయంలో మంచి వ్యక్తులు అండగా ఉండటం అదృష్టం. ఈ జీవితం ఎంత చిన్నదో, ఈ చిన్న జీవితంలో మనం ఏం చేసినా, చేయకపోయినా అందరూ అందరికీ అండగా నిలవాలని అర్థమైంది. ప్రతి ఒక్కరి ప్రేమకు కృతజ్ఞతలు. మీ ప్రేమ లేకుండా తమీమ్ లేడు’’ అని తమీమ్ అకౌంట్లో పోస్టు పెట్టారు.
2025 జనవరిలో తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు.
243 వన్డేలు, 70 టెస్టులు, 78 టీ20లు ఆడి అన్ని ఫార్మాట్లలో కలిపి 15 వేలకు పైగా పరుగులు సాధించాడు. అతను 25 సెంచరీలు కూడా చేశాడు. అత్యధిక సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్ అతడే. చివరిసారిగా 2023 సెప్టెంబర్లో న్యూజిలాండ్ తో స్వదేశంలో ఆడాడు.
సంబంధిత కథనం