Champions Trophy: పేరుకే కూనలు.. పెద్ద జట్లకూ షాకిస్తాయ్.. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ తో బహుపరాక్
Champions Trophy: పేరుకే చిన్న జట్లు కానీ సంచలన విజయాలు సాధించడం బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లకు కొత్తేమీ కాదు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ పెద్ద జట్లకు షాకిచ్చేందుకు ఇవి సిద్ధమయ్యాయి.

ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తాచాటేందుకు బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ సిద్ధమయ్యాయి. ఈ చిన్న జట్లు టైటిల్ కొడతాయనే అంచనాలు పెద్దగా లేవు. కానీ తమకంటే మెరుగైన పెద్ద జట్లపై విజయాలతో సంచలనాలు నమోదు చేసే సత్తా మాత్రం ఉంది. అందుకే ఈ టోర్నీలో బంగ్లా, అఫ్గాన్ తో జాగ్రత్తగా ఆడాలని పెద్ద జట్లు అనుకుంటున్నాయి.
భారత్ తో పోరుతో
బంగ్లాదేశ్ జట్టు భారత్ తో పోరుతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని ఆరంభించనుంది. గురువారం (ఫిబ్రవరి 20) దుబాయ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే కొన్ని సార్లు భారత్ పై సంచలన విజయాలు సాధించిన బంగ్లా మరోసారి అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో ఉంది. కానీ టీమ్ఇండియా జోరు ముందు బంగ్లా నిలబడటం కష్టమే.
2017లో సెమీస్
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లా సెమీస్ వరకూ వెళ్లగలిగింది. ఓ ఐసీసీ టోర్నీలో ఆ జట్టుకు అదే అత్యుత్తమ ప్రదర్శన. ఈ సారి స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ జట్టులో లేడు. గత 12 వన్డేల్లో ఆ జట్టు 4 మాత్రమే గెలిచింది. నాలుగు సిరీస్ ల్లో మూడు ఓడిపోయింది. కానీ తనదైన రోజున ఎంతటి జట్టునైనా బంగ్లా ఓడించగలదు. బ్యాటింగ్ లో సౌమ్య సర్కార్, కెప్టెన్ శాంటో, మిరాజ్.. బౌలింగ్ లో తస్కిన్, షోరిఫుల్, ముస్తాఫిజుర్ ఆ జట్టుకు కీలకం.
అఫ్గాన్ ప్రకంపనలు
2023 వన్డే ప్రపంచకప్ లో అఫ్గానిస్థాన్ ప్రకంపనలు అంతా ఇంతా కాదు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కు షాకిచ్చింది. పాకిస్థాన్, శ్రీలంకనూ ఓడించింది. ఆస్ట్రేలియాను దాదాపు ఓడించినంత పని చేసింది. 2024 టీ20 ప్రపంచకప్ లో సెన్సేషనల్ ఫామ్ ను కొనసాగించి సెమీస్ చేరింది. ఇప్పుడు తొలిసారి ఐసీసీ మెంబర్ గా ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగుతున్న అఫ్గాన్ తనదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో ఉంది.
స్పిన్ ఆయుధం
అఫ్గానిస్థాన్ కు స్పిన్ ప్రధాన ఆయుధం. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబి, ఖరోటెతో ఆ జట్టు స్పిన్ విభాగం పటిష్ఠంగా ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో కలిసి గ్రూప్- బిలో ఉన్న అఫ్గాన్ సత్తా మేర ఆడితే సంచలన విజయాలు సాధించగలదు. కెప్టెన్ హష్మతుల్లా అఫ్రిది, జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్, ఆల్ రౌండర్ ఒమర్ జాయ్ ఆ జట్టుకు మరింత బలాన్ని అందిస్తున్నారు.
సంబంధిత కథనం