చిన్నస్వామి స్టేడియం సురక్షితం కాదు.. జస్టిస్ జాన్ మైఖేల్ కమిషన్ నివేదిక.. మహిళల వరల్డ్ కప్, ఐపీఎల్ ఆడటంపై అనుమానాలు!-bangalore chinnaswamy stadium not safe declared by justice john michael commission over womens world cup 2025 ipl 2026 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  చిన్నస్వామి స్టేడియం సురక్షితం కాదు.. జస్టిస్ జాన్ మైఖేల్ కమిషన్ నివేదిక.. మహిళల వరల్డ్ కప్, ఐపీఎల్ ఆడటంపై అనుమానాలు!

చిన్నస్వామి స్టేడియం సురక్షితం కాదు.. జస్టిస్ జాన్ మైఖేల్ కమిషన్ నివేదిక.. మహిళల వరల్డ్ కప్, ఐపీఎల్ ఆడటంపై అనుమానాలు!

Sanjiv Kumar HT Telugu

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సామూహిక సమావేశాలకు అనువైనది, సురక్షితం కాదని జస్టిస్ జాన్ మైఖేల్ డి కున్హా కమిషన్ అభిప్రాయపడింది. దీంతో మహిళల వరల్డ్ కప్ 2025, ఐపీఎల్ 2026 మ్యాచ్‌లు ఆడటంపై అనుమానాలు మొదలయ్యాయి. జూన్ 4న జరిగిన ఘోర తొక్కిసలాట కారణంగా కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

చిన్నస్వామి స్టేడియం సురక్షితం కాదు.. జస్టిస్ జాన్ మైఖేల్ కమిషన్ నివేదిక.. మహిళల వరల్డ్ కప్, ఐపీఎల్ ఆడటంపై అనుమానాలు! (REUTERS)

కర్ణాటక ప్రభుత్వం నియమించిన జస్టిస్ జాన్ మైఖేల్ డి కున్హా కమిషన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం 'సామూహిక సమావేశాలకు అనువైనది, సురక్షితం కాదు' అని తేల్చింది. ఈ ఏడాది చివర్లో మహిళల ప్రపంచ కప్, ఐపీఎల్ 2026 మ్యాచ్‌లతో సహా కొన్ని పెద్ద మ్యాచ్‌లు ఈ వేదికపై జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

ఆర్సీబీ గెలుపు ఉత్సవాల్లో తొక్కిసలాట

ఈ ఏడాది ప్రారంభంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విన్నింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

స్టేడియం డిజైన్, నిర్మాణం జన సామర్థ్యానికి అనువుగా లేదని, ప్రజలకు సురక్షితం కాదని కమిషన్ కర్ణాటక కేబినెట్ ముందు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది చివర్లో ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌లకు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా.. తాజా పరిశీలనను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది.

అనుమానాలు

దీంతో ఆ మ్యాచ్‌లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అవి జరుగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జస్టిస్ జాన్ మైఖేల్ కమిషన్ చిన్నస్వామి స్టేడియం డిజైన్, నిర్మాణంలో సమస్యలను నివేదికలో ఉదహరించింది. "ఇది సామూహిక సమావేశాలకు అనుచితమైనది, అసురక్షితమైనది" అని పేర్కొంది.

ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించడం వల్ల ప్రజా భద్రతకు ప్రమాదం పొంచి ఉందని కమిషన్ పేర్కొంది. "ఈ వ్యవస్థాగత పరిమితుల దృష్ట్యా, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించే ఈవెంట్లను ఇంత పెద్ద సమావేశాలకు బాగా సరిపోయే వేదికలకు మార్చాలి. దానిని స్టేడియం అధికారులు పరిగణించాలని కమిషన్ గట్టిగా సిఫార్సు చేస్తుంది" అని కమిషన్ పేర్కొంది.

అత్యవసర తరలింపు ప్రణాళికలు

భవిష్యత్తులో ఇటువంటి విషాదకర సంఘటనలను నివారించడానికి "సామూహిక ప్రవేశం, నిష్క్రమణకు తగిన ఇన్ అండ్ అవుట్ గేట్లు, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అత్యవసర తరలింపు ప్రణాళికలు" వంటి నివారణ చర్యలను కమిషన్ సూచించింది.

జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన కేఎస్సీఏ చీఫ్ రఘురామ్ భట్, మాజీ కార్యదర్శి ఏ శంకర్, మాజీ కోశాధికారి ఈఎస్ జైరాంలపై చట్టపరమైన చర్యలకు కమిటీ సిఫారసు చేసింది.

చర్యలు తీసుకోవాలని

ఆర్సీబీ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ మీనన్, డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్ ఎండీ టీ వెంకట్ వర్ధన్, వీపీ సునీల్ మాథుర్లపై చర్యలు తీసుకోవాలని సూచించింది. బి దయానంద, వికాశ్ కుమార్, శేఖర్ హెచ్ టి, సి బాలకృష్ణ, ఎకె గిరీష్ సహా పలువురు పోలీసు అధికారులను కూడా ఈ ఏర్పాట్లకు బాధ్యులుగా కమిషన్ పేర్కొంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం