Ban vs NZ: న్యూజిలాండ్‌పై మరో చారిత్రక విజయానికి చేరువలో బంగ్లాదేశ్
Ban vs NZ: న్యూజిలాండ్‌పై మరో చారిత్రక విజయానికి బంగ్లాదేశ్ చేరువలో ఉంది. తొలి టెస్టులో 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 113 రన్స్ మాత్రమే చేయగలిగింది.
Ban vs NZ: తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన న్యూజిలాండ్ పై మరో చారిత్రక విజయంపై బంగ్లాదేశ్ కన్నేసింది. సిల్హెట్ లో జరుగుతున్న తొలి టెస్టులో మరో 3 వికెట్లు తీస్తే బంగ్లా గెలుస్తుంది. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 310, రెండో ఇన్నింగ్స్ లో 338 రన్స్ చేసిన బంగ్లాదేశ్.. తర్వాత న్యూజిలాండ్ ను కట్టడి చేసింది.
తొలి ఇన్నింగ్స్ లో మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సెంచరీతో 317 పరుగులు చేసిన న్యూజిలాండ్.. రెండో ఇన్నింగ్స్ లో తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో 7 పరుగుల ఆధిక్యం లభించగా.. తర్వాత 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 113 పరుగులు మాత్రమే చేసింది.
విజయానికి ఇంకా 219 పరుగులు అవసరం కాగా.. క్రీజులో డారిల్ మిచెల్ రూపంలో ఒకే ఒక్క బ్యాటర్ ఉన్నాడు. టెయిలెండర్లతో అతడు చివరి రోజు ఎంత వరకూ ఇన్నింగ్స్ లాక్కెళ్తాడన్నది అనుమానమే. అతడు 86 బంతుల్లో 44 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇష్ సోధీ 7 పరుగులతో ఆడుతున్నాడు. ఈ ఇద్దరూ 8వ వికెట్ కు ఇప్పటి వరకూ 11 పరుగులు జోడించారు.
బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ దెబ్బకు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. తైజుల్ 20 ఓవర్లలో 40 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. దీంతో న్యూజిలాండ్ ఓపెనర్లు లేథమ్ (0), కాన్వే (22) సహా విలియమ్సన్ (11), హెన్రీ నికోల్స్ (2), టామ్ బ్లండెల్ (6), గ్లెన్ ఫిలిప్స్ (12) విఫలమయ్యారు. తొలి ఓవర్ చివరి బంతికి తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది.
ఐదో రోజు న్యూజిలాండ్ విజయానికి 219 రన్స్, బంగ్లాదేశ్ కు 3 వికెట్లు అవసరం. గతేడాది జనవరి 1న మౌంట్ మాంగనూయిలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను 8 వికెట్లతో చిత్తు చేసి తొలిసారి ఆ జట్టుపై సంచలన విజయం సాధించిన బంగ్లాదేశ్.. ఇప్పుడు మరో విజయంపై కన్నేసింది.