Babar Azam World Record: వన్డేల్లో విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజం
Babar Azam World Record: వన్డేల్లో విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్ చేశాడు పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం. శుక్రవారం (ఫిబ్రవరి 14) న్యూజిలాండ్ తో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో బాబర్ ఈ ఘనత సాధించాడు.

Babar Azam World Record: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉన్న ఈ రికార్డును అతడు సమం చేశాడు. అదే సమయంలో టీమిండియా గ్రేట్ విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ రికార్డులను బ్రేక్ చేశాడు.
బాబర్ ఆజం వరల్డ్ రికార్డు
న్యూజిలాండ్ తో శుక్రవారం (ఫిబ్రవరి 14) కరాచీలో ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో బాబర్ ఆజం అత్యంత వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో తాను ఆడిన మూడో బంతిని బౌండరీకి తరలించడం ద్వారా బాబర్ ఈ రికార్డు అందుకున్నాడు. అతనికి వన్డేల్లో ఇది 123వ ఇన్నింగ్స్.
ఈ క్రమంలో ఇన్నే ఇన్నింగ్స్ లో 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్న సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా రికార్డును బాబర్ సమం చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 136 ఇన్నింగ్స్ లో, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ 139 ఇన్నింగ్స్ లో 6 వేల పరుగుల మార్క్ అందుకున్నారు. అత్యంత వేగంగా వన్డేల్లో 6 వేల పరుగులు చేసిన ఏషియన్ బ్యాటర్ గా బాబర్ ఆజం రికార్డు నెలకొల్పాడు.
కొనసాగిన బాబర్ చెత్త ఫామ్
బాబర్ ఆజం ఫైనల్లో ఈ రికార్డు అందుకున్నా.. ముక్కోణపు సిరీస్ లో అతని చెత్త ఫామ్ మాత్రం కొనసాగింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో అతడు 34 బంతుల్లో 29 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు.
అంతకుముందు లీగ్ స్టేజ్ లో న్యూజిలాండ్ పై 10, సౌతాఫ్రికాపై 23 రన్స్ చేశాడు. వన్డేల్లో సుమారు రెండేళ్లుగా అతడు సెంచరీ కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిసారి 2023లో నేపాల్ పై వన్డేల్లో బాబర్ సెంచరీ చేశాడు.
నన్ను కింగ్ అని పిలవొద్దు: బాబర్
ఇక ఈ మధ్యే బాబర్ ఆజం మీడియాతో మాట్లాడుతూ.. తనను కింగ్ అని పిలవొద్దని కోరాడు. "దయచేసి నన్ను కింగ్ అని పిలవడం ఆపండి. నేను కింగ్ కాదు. ఆ స్థాయికి ఇంకా చేరలేదు. నాకు కొన్ని కొత్త రోల్స్ ఉన్నాయి" అని బాబర్ అన్నాడు. గతంలో తాను ఎన్ని పరుగులు చేసినా.. ఇప్పటి మ్యాచ్ ఎలా ఆడుతున్నాను.. భవిష్యత్తులో ఎలా ఆడతానన్నదే ముఖ్యమని కూడా అతడు స్పష్టం చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ ఈ ముక్కోణపు సిరీస్ లో ఆడింది. ఆ మెగా టోర్నీలో ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తో కలిసి పాకిస్థాన్ గ్రూప్ ఎలో ఉంది. ఫిబ్రవరి 19న న్యూజిలాండ్ తోనే తొలి మ్యాచ్ ఆడనుంది.
సంబంధిత కథనం