World Cup 2023: నేడు పాకిస్తాన్‌కు పరువు మ్యాచ్.. గెలవకుంటే కెప్టెన్సీకై బాబర్ అజం గుడ్ బై
Babar Azam Step Down From Captaincy: భారత్ దాయాది పాకిస్తాన్‌కు నేడు ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిచి సెమిస్‌కు చేరుకోకపోతే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం తన కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Pakistan Vs England ICC World Cup 2023: ప్రస్తుతం భారతదేశమంతటా ఐసీసీ వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ అగ్ర స్థానంతో ముందడుగులో ఉంటే.. దాయాది దేశం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. వరల్డ్ కప్ 2023లో భాగంగా నవంబర్ 11 శనివారం ఇంగ్లాండ్‌తో పాకిస్తాన్ తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ పాకిస్తాన్‌కు కీలకంగా మారనుంది. మరి చెప్పాలంటే పాకిస్తాన్‌కు ఇది పరువు మ్యాచ్.
వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో పాక్ ప్లేయర్స్ ప్రతీ మ్యాచ్‌లో నిరాశపరుస్తూ వచ్చారు. బ్యాటింగ్ పరంగా పర్వాలేదనిపించుకున్నా బౌలర్ల నుంచి సహకారం లేకపోవడంతో భారీ స్కోర్లు సాధించిన టీమ్స్ పై గెలవడం కష్టమైంది. అయితే, ఈ ప్రభావం అంతా కెప్టెన్ బాబర్ అజంపై పడుతోంది. వరల్డ్ కప్ మెగా టోర్నీలో పాక్ వరుస వైఫల్యాలు సెమీ ఫైనల్‌లో చోటు సంపాదించడానికి కష్టతరంగా మారింది. ఇప్పటికే టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన పాక్ కేవలం 4 మాత్రమే గెలిచింది. దాంతో పాకిస్తాన్‌కు 8 పాయింట్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో శనివారం ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్ పాకిస్తాన్‌కు పరువు సమస్యగా మారింది. ఇంగ్లాండ్‌పై పాక్ గెలిస్తే వచ్చేది 10 పాయింట్స్ మాత్రమే. ఇప్పటికే ఇదే 10 పాయింట్లతోపాటు మెరుగైన రన్ రేట్‌తో పాక్ కంటే మంచి స్థానంలో ఉన్న న్యూజిలాండ్ సెమీస్‌కు అర్హత సాధించింది. ఇంగ్లాండ్‌ను 287 పరుగుల తేడాతో పాక్ ఓడిస్తే తప్పా సెమీ ఫైనల్ బెర్త్ దక్కడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ఇంటికే వెళ్లడం కచ్చితం అవుతోంది. అందుకే ఈ మ్యాచ్ పాక్ పరువుకు సవాల్ కానుంది.
ఇదిలా ఉంటే వరల్డ్ కప్‌లో అంచనాలు అందుకోలేకపోవడం, పేలవమైన ప్రదర్శన, పలు రకాల విమర్శలతో పాక్ కెప్టెన్ బాబర్ అజం సతమతం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ తర్వాత బాబర్ అజం తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్నాడని తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ తర్వాత వైట్ బాల్ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. కాబట్టి ఇవాళ ఏదైనా మిరాకిల్ జరిగి పాక్ గెలిస్తే తప్పా బాబర్ కెప్టెన్‌గా కొనసాగడం కష్టమని తెలుస్తోంది.