ఛాంపియన్స్ ట్రోఫీలో ఫెయిల్యూర్ తో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు బాబర్ పై ఫైర్ అవుతున్నారు. మరోవైపు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు బాబర్ ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పించింది. ఇలా అన్ని రకాలుగా మాటల దాడి ఎదుర్కొంటున్న బాబర్ కు సపోర్ట్ గా అతని తండ్రి వచ్చాడు. బాబర్ తండ్రి అజామ్ సిద్దిఖీ ఇన్ స్టాగ్రామ్ లో సంచలన పోస్టు చేశాడు.
తన కొడకు బాబర్ కు సపోర్ట్ గా తండ్రి అజామ్ సిద్దిఖీ రంగంలోకి దిగారు.
‘‘బాస్ ఈజ్ అల్వేస్ రైట్. ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ లో మెంబర్. ఆ క్యాప్ అందుకున్న తర్వాత కూడా అతణ్ని (బాబర్) జట్టు నుంచి తప్పించారు. అయినా సరే. నేషనల్ టీ20, పీఎస్ఎల్ లో అతను సత్తాచాటి తిరిగి టీమ్ లోకి వస్తాడు. వాళ్లు చాలా పెద్ద ప్లేయర్లు (విమర్శించిన వాళ్లు). వాళ్లు సరిగ్గా మాట్లాడితే మంచిది. ఎవరైనా వాళ్లకు ఆన్సర్ ఇస్తే తట్టుకోలేరు మీది గతం. మీకు తలుపులు మూసుకుపోయాయి’’ అని సిద్దిఖీ పోస్టు చేశాడు.
‘‘ఫాదర్ ఎక్కువగా మాట్లాడితే వెంటనే మహ్మద్ ప్రవక్త అంటూ కొంతమంది ఎగతాళి చేస్తారు. ఆయనే ఫస్ట్ అండ్ లాస్ట్ కోచ్. మెంటార్, మాట్లాడే ప్రతినిధి. అందుకే అంతటి సామర్థ్యం లేనివాళ్లు ఓపికతో ఉండాలి. ఇప్పుడు ఏం చేశారు? అని ప్రశ్నించే ఫ్యాన్స్ ఒక్కసారి పీసీబీ వెబ్ సైట్ చెక్ చేయాలి. పాకిస్థాన్ జిందాబాద్’’ అని సిద్ధిఖీ ఆ పోస్టులో ఫైర్ అయ్యారు.
పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆ టీమ్ ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. న్యూజిలాండ్, భారత్ చేతిలో పాక్ ఓడింది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఈ సిరీస్ లో బాబర్ పేలవ ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్ పై పనికిరాని ఫిఫ్టీ చేసిన బాబర్.. ఇండియాపై ఫెయిల్ అయ్యాడు. దీంతో బాబర్ పై విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇక పాక్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ అయితే ఏకంగా బాబర్ ను మోసగాడు అని వ్యాఖ్యానించాడు. ఈ విమర్శల నేపథ్యంలో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు బాబర్ ఆజం ను పీసీబీ సెలక్ట్ చేయలేదు.
పాకిస్థాన్ టీ20 టీమ్ నుంచి బాబర్ ఆజంతో పాటు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ను తప్పించడానికి గల కారణాన్ని తాత్కాలిక ప్రధాన కోచ్, జాతీయ సెలక్టర్ ఆకిబ్ జావేద్ వెల్లడించాడు. జట్టుకు కొత్త మనస్తత్వాన్ని అందించడం కోసం, ఆధునిక టీ20 క్రికెట్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నజావేద్ వివరించాడు.
"మీరు ఇతర జట్లను పరిశీలిస్తే, వాటిలో 70 శాతం ప్రత్యేక టీ20 జట్లను కలిగి ఉన్నాయి. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో మేం కూడా ఆ దిశగా పనిచేస్తున్నాం. భయం లేకుండా క్రికెట్ ఆడే వాళ్లు మాకు కావాలి’’ అని మీడియాతో జావేద్ చెప్పాడు.
సంబంధిత కథనం