Ayush Mhatre Record: యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన 17 ఏళ్ల ముంబై క్రికెటర్ ఆయుష్ మాత్రే
Ayush Mhatre Record: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు ముంబైకి చెందిన 17 ఏళ్ల బ్యాటర్ ఆయుష్ మాత్రే. విజయ్ హాజారే ట్రోఫీలో భాగంగా నాగాలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆయుష్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
Ayush Mhatre Record: యశస్వి జైస్వాల్ ప్రస్తుతం టీమిండియాకు టెస్టులు, టీ20ల్లో రెగ్యులర్ ఓపెనర్ గా మారిపోయాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ జట్టులో నిలదొక్కుకున్నాడు. మరోవైపు మంగళవారం (డిసెంబర్ 31) లిస్ట్ ఎ క్రికెట్ లో యశస్వి వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆయుష్ మాత్రే. అత్యంత పిన్న వయసులో 150కిపైగా స్కోరు చేసిన బ్యాటర్ గా వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
ఆయుష్ మాత్రే వరల్డ్ రికార్డు
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై, నాగాలాండ్ మ్యాచ్ లో వరల్డ్ రికార్డు నమోదైంది. ముంబై తరఫున బరిలోకి దిగిన ఆయుష్ మాత్రే 117 బంతుల్లో 181 రన్స్ చేశాడు. అతని వయసు కేవలం 17 ఏళ్ల 168 రోజులు మాత్రమే. ఈ క్రమంలో లిస్ట్ ఎ క్రికెట్ లో అత్యంత పిన్న వయసులో 150, అంతకంటే ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు.
అంతకుముందు 2019లో యశస్వి జైస్వాల్ 17 ఏళ్ల 291 రోజుల వయసులో ఈ రికార్డు నమోదు చేయగా.. ఇప్పుడా రికార్డు బ్రేకయింది. యశస్వి ముంబై తరఫునే 2019లో జార్ఖండ్ పై ఈ ఘనత సాధించాడు. నాగాలాండ్ తో మ్యాచ్ లో ముంబై 404 పరుగులు చేసింది. ఆయుష్.. 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్స్ లతో 181 రన్స్ చేశాడు. ఇక చివర్లో శార్దూల్ ఠాకూర్ కూడా చెలరేగి కేవలం 28 బంతుల్లో 73 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ముంబై భారీ స్కోరు చేయగలిగింది.
ధోనీ మెచ్చిన బ్యాటర్ ఆయుష్
నిజానికి ఆ మధ్య జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఆయుష్ మాత్రే అమ్ముడుపోలేదు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ ప్రశంసలు అందుకున్నాడు. వేలానికి 15 రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ సెలక్షన్ ట్రయల్స్ కు ఆయుష్ కూడా హాజరయ్యాడు. అంతకుముందు రంజీ ట్రోఫీలో అతని బ్యాటింగ్ చూసి ధోనీ ఇంప్రెస్ అయ్యాడు.
దీంతో మాత్రేను ట్రయల్స్ కు పంపించాల్సిందిగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ను సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కోరారు. అయితే ఐపీఎల్ వేలంలో మాత్రం అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. అండర్ 19 ఏషియా కప్ ఫైనల్లోనూ ఆయుష్ రాణించాడు. అతడు ఐదు ఇన్నింగ్స్ లో 176 రన్స్ చేయడం విశేషం.
టాపిక్