IND vs SA 3rd T20 Highlights: మ్యాచ్‌ను మలుపు తిప్పిన అక్షర్ పటేల్ స్టన్నింగ్ జంప్, మళ్లీ బాధితుడిగా మిల్లర్!-axar patel reminds david miller of t20 world cup catch with breathtaking grab in ind vs sa 3rd t20 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sa 3rd T20 Highlights: మ్యాచ్‌ను మలుపు తిప్పిన అక్షర్ పటేల్ స్టన్నింగ్ జంప్, మళ్లీ బాధితుడిగా మిల్లర్!

IND vs SA 3rd T20 Highlights: మ్యాచ్‌ను మలుపు తిప్పిన అక్షర్ పటేల్ స్టన్నింగ్ జంప్, మళ్లీ బాధితుడిగా మిల్లర్!

Galeti Rajendra HT Telugu
Nov 14, 2024 02:18 PM IST

Axar Patel Catch: బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ తల మీదుగా బంతి సిక్స్‌గా వెళ్తున్నట్లు కనిపించింది. కానీ.. ఆఖరి క్షణంలో పక్షిలా జంప్ చేసిన అక్షర్..?

మిల్లర్ క్యాచ్ పడుతున్న అక్షర్ పటేల్
మిల్లర్ క్యాచ్ పడుతున్న అక్షర్ పటేల్

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా టీమ్ 208/7కే పరిమితమైంది. దాంతో 11 పరుగుల తేడాతో గెలిచిన భారత్ జట్టు.. నాలుగు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఆఖరి టీ20 మ్యాచ్ జొహనెస్‌బర్గ్ వేదికగా శుక్రవారం రాత్రి 8.30 గంటలకి జరగనుంది.

220 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా హిట్టర్లు హెన్రిచ్ క్లాసెన్ (41: 22 బంతుల్లో 1x4, 4x6), డేవిడ్ మిల్లర్ (18: 18 బంతుల్లో 1x4, 1x6) భారీ షాట్లు ఆడుతూ ఆ జట్టుకి విజయాన్ని అందించేలా కనిపించారు. కానీ.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా.. ఒక సిక్స్‌ను మిల్లర్‌కి సమర్పించుకుని మరీ బోల్తా కొట్టించాడు.

సిక్స్ సమర్పించుకుని మరీ.. వికెట్

ఛేదనలో ది కిల్లర్‌గా పేరొందిన మిల్లర్.. బంతి ఎంత వేగంగా వచ్చినా ఫుల్ చేయడంలో ఎక్స్‌ఫర్ట్. దాంతో షార్ట్ పిచ్ బంతితో అతడ్ని ఊరించిన హార్దిక్ పాండ్యా.. ఒక సిక్స్ కూడా సమర్పించుకున్నాడు. అయినప్పటికీ తర్వాత బంతిని కూడా షార్ట్ పిచ్ బంతిగానే విసిరి.. ఈసారి వేగం కాస్త తగ్గించాడు. అయినప్పటికీ మిల్లర్ ఆ బంతిని కూడా సిక్స్‌గా కొట్టేందుకు ఫుల్ చేశాడు.

బంతి అతను ఆశించిన విధంగానే బ్యాట్‌కి కనెక్ట్ అవ్వడంతో బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ అక్షర్ పటేల్ తల మీదుగా సిక్స్‌గా వెళ్తున్నట్లు కనిపించింది. కానీ.. ఆఖరి వరకూ బంతిని తీక్షణంగా చూసిన అక్షర్ పటేల్.. లాస్ట్ సెకండ్‌లో పక్షిలా గాల్లోకి ఎగిరి బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు.

సేఫ్ ల్యాండ్ ఇంపార్టెంట్

సాధారణంగా ఇలా క్యాచ్ అందుకున్న తర్వాత ఫీల్డర్ పట్టుజారి బౌండరీ లైన్‌పై పడిపోవడం లేదా బంతిని చేజార్చడం చేస్తుంటారు. కానీ.. మెరుగైన ఫిట్‌నెస్ ఉన్న అక్షర్ పటేల్ ఒక అథ్లెట్ తరహాలో బంతిని క్యాచ్ అందుకున్న తర్వాత సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. దాంతో ఆ క్యాచ్‌ను నమ్మలేనట్లు చూసిన మిల్లర్ నిరాశగానే పెవిలియన్ బాట పట్టాడు. ఇక అక్కడి నుంచి దక్షిణాఫ్రికా టీమ్‌ ఓటమి దిశగా అడుగులు వేసింది.

వరల్డ్‌కప్ ఫైనల్లోనూ ఇలానే

2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కూడా ఇదే తరహాలో డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను సూర్యకుమార్ యాదవ్ పట్టాడు. అయితే.. బంతిని క్యాచ్‌గా అందుకున్న సూర్య.. అదుపు తప్పి బౌండరీ లైన్‌ వెలుపలికి వెళ్లబోతూ వెంటనే బంతిని మైదానంలో విసిరేశాడు. ఆ తర్వాత లైన్ వెలుపలి నుంచి మళ్లీ మైదానంలోకి వచ్చి ఆ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. ఆ క్యాచ్‌తోనే దక్షిణాఫ్రికా జట్టుకి వరల్డ్‌కప్ చేజారింది. ఆ మ్యాచ్‌లో.. బుధవారం రాత్రి మూడో టీ20లో బౌలర్ హార్దిక్ పాండ్యానే కావడం యాదృశ్చికం. కేవలం ఫీల్డర్ మాత్రమే మారాడు.

ఈ మూడో టీ20లో భారత యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 107 పరుగులు చేశాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 22 ఏళ్ల తిలక్ వర్మ హైదరాబాద్‌కి చెందిన ప్లేయర్.

Whats_app_banner