ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. సోమవారం (జూన్ 2) ఈ మేరకు షాకింగ్ ప్రకటన చేశాడు. వచ్చే టీ20 ప్రపంచకప్ పై ఫోకస్ చేయడానికి మ్యాక్సీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నాడు ఈ ఆసీస్ డేంజరస్ ప్లేయర్.
2026లో భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం మ్యాక్స్ వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2026 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ తో పాటు బిగ్ బాష్ లీగ్, ఇతర గ్లోబల్ కమిట్‌మెంట్లకు ప్రాధాన్యత ఇవ్వడానికి తన వన్డే కెరీర్‌కు ముగింపు పలికాడు. 36 ఏళ్ల మ్యాక్స్‌వెల్ 149 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 33.81 సగటుతో 3990 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, 23 అర్ధ శతకాలతో పాటు 77 వికెట్లు తీశాడు.
భారత్ ఆతిథ్యమిచ్చిన 2023 వన్డే ప్రపంచ కప్ లో మ్యాక్స్‌వెల్ అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గానిస్థాన్ తో మ్యాచ్ లో ఆసీస్ 91/7తో కష్టాల్లో ఉన్నప్పుడు.. తీవ్రమైన కండరాల నొప్పితో బాధపడుతున్నప్పటికీ మ్యాక్స్‌వెల్ అద్భుత పోరాట పటిమతో అదరగొట్టాడు. మ్యాక్స్‌వెల్ 128 బంతుల్లో 201 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ కమిన్స్ తో కలిసి 202 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలిపించాడు. ఫైనల్లో ఇండియాను ఓడించి ఆసీస్ విజేతగా నిలిచింది.
మ్యాక్స్‌వెల్ వన్డే కెరీర్‌లో 126 స్ట్రైక్ రేటును కలిగి ఉన్నాడు. ఇది 50 ఓవర్ల ఫార్మాట్‌లో రెండో అత్యధికం. వెస్టిండీస్ ప్లేయర్ రస్సెల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఆసీస్ తరపున 2015, 2023 వన్డే ప్రపంచకప్ లు గెలిచాడు.
“పరిస్థితులకు శరీరం ఎలా స్పందించిన దాన్ని బట్టి నేను జట్టును కొంతవరకు నిరాశపరిచినట్లు అనిపించింది. జార్జ్ బెయిలీ (సెలక్షన్ కమిటీ ఛైర్మన్)తో చర్చించా. అతని ఆలోచనలు ఏమిటో అడిగా” అని మ్యాక్స్‌వెల్ ఫైనల్ వర్డ్ పాడ్‌కాస్ట్‌కు తెలిపాడు.
“2027 ప్రపంచ కప్ గురించి మాట్లాడుకున్నాం. కానీ నా ప్లేస్ లో వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వాడానికి సమయం ఆసన్నమైందని భావించా. ఆడే సత్తా నాలో ఉంటే జట్టులో కొనసాగుతా అని గతంలో చెప్పా. కొన్ని సిరీస్ లు మాత్రమే ఆడాలని, స్వార్థపూరిత కారణాల కోసం టీమ్ లో ఉండాలని కోరుకోలేదు’’ అని మ్యాక్స్‌వెల్ అన్నాడు.
మ్యాక్స్‌వెల్ ఇటీవల వేలి గాయం కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ నుంచి తప్పుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. ఆ ఆల్‌రౌండర్ ఏడు మ్యాచ్‌ల్లో 48 పరుగులు చేసి, నాలుగు వికెట్లు తీశాడు. భారత సంతతికి చెందిన వినీ రామన్ ను 2023లో మ్యాక్స్ వెల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం