World Cup 2023 Semis: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. తుది జట్లలో మార్పులు చేసిన ఇరు టీమ్‍లు
World Cup 2023 - Australia vs South Africa: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ప్రపంచకప్ రెండో సెమీస్ మొదలైంది. ముందుగా దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. ఈ మ్యాచ్‍లో గెలిచిన జట్టు ఫైనల్‍లో టీమిండియాలో తలపడనుంది.
World Cup 2023 - Australia vs South Africa: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ షురూ అయింది. ఈ మ్యాచ్‍లో గెలిచిన జట్టుతో ఫైనల్‍లో టీమిండియా తలపడనుంది. కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా నేడు (నవంబర్ 16) ఆసీస్, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్ జరుగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా సారథి టెంబా బవుమా ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. తుది జట్టులో ఆస్ట్రేలియా రెండు మార్పులు చేయగా.. దక్షిణాఫ్రికా కూడా రెండు చేంజెస్ చేసింది.
ఈ సెమీస్ మ్యాచ్‍లో ఆస్ట్రేలియా తుది జట్టులోకి గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ వచ్చేశారు. గాయం కారణంగా ఓ మ్యాచ్‍కు దూరమైన మ్యాక్స్‌వెల్ మళ్లీ జట్టులోకి రావడం ఆసీస్‍కు మరింత సానుకూలంగా మారింది. స్టోయినిస్, అబాట్‍ను పక్కన పెట్టింది ఆసీస్.
గత మ్యాచ్‍తో పోలిస్తే దక్షిణాఫ్రికా కూడా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. పేసర్ లుంగీ ఎంగ్డీ స్థానంలో స్పిన్నర్ షంషీని సఫారీ టీమ్ తీసుకుంది. ఫెలుక్వాయో స్థానంలో మార్కో జాన్సెన్ వచ్చాడు.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో నాలుగు సార్లు సెమీస్ చేరిన దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. దీంతో ఈ మ్యాచ్ గెలిచి తుది పోరుకు చేరాలని సఫారీ జట్టు కసిగా ఉంది. మరోవైపు వన్డే ప్రపంచకప్ చరిత్రలో సెమీస్‍లో దక్షిణాఫ్రికాను రెండుసార్లు ఓడించింది ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా. ఈసారి కూడా సత్తాచాటాలని పట్టుదలగా ఉంది.
దక్షిణాఫ్రికా తుదిజట్టు: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), రాసీ వాండర్ డుసెన్, ఐడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోట్జీ, కగిసో రబాడ, తర్బైజ్ షంషి
ఆస్ట్రేలియా తుదిజట్టు: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆజమ్ జంపా, జోష్ హేజిల్‍వుడ్
ఈ రెండో సెమీస్‍లో గెలిచిన జట్టుతో టీమిండియా ఫైనల్ ఆడనుంది. బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్‍లో న్యూజిలాండ్‍పై గెలిచి ఫైనల్ చేరింది భారత్. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది.