ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియా పెను సంచలనం నమోదు చేసింది. కీలక ఆటగాళ్లు దూరమైనా టోర్నీలో తన తొలి మ్యాచ్ లోనే కంగారూ జట్టు రికార్డు ఛేజింగ్ కంప్లీట్ చేసింది. శనివారం (ఫిబ్రవరి 22) గడాఫీ స్టేడియంలో జోష్ ఇంగ్లిస్ (120 నాటౌట్) సెన్సేషనల్ సెంచరీతో ఆసీస్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. 352 ఛేజింగ్ ను 5 వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలో కంప్లీట్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలోనే కాదు ఐసీసీ టోర్నీల్లోనే ఇదే హైయ్యస్ట్ ఛేజింగ్. మొదట ఇంగ్లండ్ 351/8 స్కోరు చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తో మ్యాచ్ లో భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఆసీస్ కు దెబ్బ తగిలింది. ప్రమాదకర ఆటగాడు ట్రేవిస్ హెడ్ (6)ను ఆర్చర్ త్వరగానే పెవిలియన్ చేర్చాడు. ఇక బుల్లెట్ లాంటి బంతులతో రెచ్చిపోయిన మార్క్ వుడ్.. కెప్టెన్ స్మిత్ (5) వికెట్ ను దక్కించుకున్నాడు. 27 కే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్ కొండంత లక్ష్యాన్ని అందుకోవడం కష్టమేననిపించింది.
ఛేదన ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ ను మొదట మాథ్యూ షార్ట్ (63), లబుషేన్ (47) ఆదుకున్నారు. మూడో వికెట్ కు 95 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. కానీ ఈ ఇద్దరిని స్వల్ప వ్యవధిలో ఔట్ చేసిన ఇంగ్లండ్ తిరిగి పోటీలోకి వచ్చేలా కనిపించింది. అయితే అలెక్స్ కేరీ (69)తో కలిసి జోష్ ఇంగ్లిస్ పోరాడాడు. ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచిన ఈ జంట అయిదో వికెట్ కు 146 పరుగులు జోడించారు.
ఇంగ్లిస్, కేరీ స్వేచ్ఛగా పరుగులు రాబట్టడంతో ఆసీస్ ఛేజింగ్ సాఫీగా సాగేలా కనిపించింది. కానీ బ్రైడెన్ కార్స్ కీలక సమయంలో కేరీని ఔట్ చేసి ఇంగ్లండ్ ను ఆనందంలో ముంచెత్తాడు. కానీ ఇంగ్లిస్ వదల్లేదు. భారీ షాట్లతో మ్యాచ్ ను పూర్తిగా ఆసీస్ వైపు టర్న్ చేశాడు. సిక్సర్ తోనే సెంచరీ అందుకున్నాడు. మరో ఎండ్ లో మ్యాక్స్ వెల్ (32 నాటౌట్) కూడా చెలరేగడంతో కంగారూ జట్టు రికార్డు ఛేజింగ్ కంప్లీట్ చేసి విజేతగా నిలిచింది.
మొదట ఇంగ్లండ్ ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. 351/8తో చరిత్ర తిరగరాసింది. ఓపెనర్ బెన్ డకెట్ (165) సెన్సేషనల్ సెంచరీతో సత్తాచాటాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. రూట్ (68) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షియస్ మూడు.. ఆడం జంపా, లబుషేన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
సంబంధిత కథనం