Stoinis Retires: వన్డేలకు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్న ప్లేయర్
Stoinis Retires: ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ స్టాయినిస్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. ఈ నెలలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా అతడు తప్పుకోవడం గమనార్హం. ఇది ఆస్ట్రేలి టీమ్ కు షాక్ లాంటిదే.

Stoinis Retires: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టాయినిస్ వన్డే క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. టీ20లపై దృష్టిసారించడానికి అతడు వన్డే క్రికెట్ గుడ్ బై చెబుతున్నట్లు అనౌన్స్ చేశాడు. అంతేకాదు ఈ నెలలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 6) అతడు ఒక ప్రకటన జారీ చేశాడు.
స్టాయినిస్ వన్డేలకు గుడ్ బై
ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టాయినిస్ తెలుసు కదా. అతడు వన్డేల నుంచి తప్పుకున్నాడు. "ఆస్ట్రేలియాకు వన్డేల్లో ఆడటం గొప్ప ప్రయాణం. గ్రీన్, గోల్డ్ జెర్సీల్లో ఆడే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు" అని స్టాయినిస్ అన్నాడు. "దేశానికి అత్యుత్తమ స్థాయిలో ఆడటం నాకు ఎప్పుడూ గొప్ప ఆనందం కలిగించేదే. ఇది అంత సులువైన నిర్ణయం కాదు. కానీ వన్డేల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. నా కెరీర్లో తర్వాతి ఛాప్టర్ పై దృష్టి సారిస్తాను" అని స్టాయినిస్ చెప్పాడు.
2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ లో స్టాయినిస్ సభ్యుడు. అయితే సెమీఫైనల్, ఫైనల్ మాత్రం అతడు ఆడలేదు. స్టాయినిస్ స్థానంలో లబుషేన్ ను ఆడించారు. తర్వాత సుమారు ఏడాది పాటు వన్డేలకు అతన్ని ఎంపిక చేయలేదు. గతేడాది అక్టోబర్లో మరోసారి పాకిస్థాన్ సిరీస్ కు స్టాయినిస్ ను ఎంపిక చేశారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా ఆస్ట్రేలియా జట్టులో అతనికి స్థానం దక్కింది. ఇప్పుడు సడెన్ గా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించి ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడంతో ఆస్ట్రేలియాకు షాక్ తగిలినట్లయింది.
స్టాయినిస్ స్థానంలో ఎవరు?
స్టాయినిస్ రిటైర్మెంట్ తో అతని స్థానంలో ఎవరన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇప్పటికే మరో ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా మడమ గాయం కారణంగా ఆడటం అనుమానంగా మారింది. స్టాయినిస్ రిటైర్మెంట్ పై ఆస్ట్రేలియా కోచ్, సెలెక్టర్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ స్పందించాడు.
"స్టాయినిస్ పదేళ్లుగా వన్డే జట్టులో ఎంతో కీలకమైన పాత్ర పోషించాడు. అతడో అద్భుతమైన ప్లేయరే కాదు.. టీమ్ లో ఉండాల్సిన గొప్ప వ్యక్తి కూడా. అతడో సహజ లీడర్ కూడా. అతడు వన్డే క్రికెట్ లో సాధించిన ఘనతలకు అభినందించాల్సిందే" అని మెడ్ డొనాల్డ్ అన్నాడు.
సంబంధిత కథనం