Will Pucovski Retirement: డేవిడ్ వార్నర్‌‌ను రీప్లేస్ చేస్తాడనుకున్న ఓపెనర్ విల్‌ పుకోవ్‌స్కీ 26 ఏళ్లకే రిటైర్మెంట్-australia opener will pucovski forced to retire from cricket at 26 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Will Pucovski Retirement: డేవిడ్ వార్నర్‌‌ను రీప్లేస్ చేస్తాడనుకున్న ఓపెనర్ విల్‌ పుకోవ్‌స్కీ 26 ఏళ్లకే రిటైర్మెంట్

Will Pucovski Retirement: డేవిడ్ వార్నర్‌‌ను రీప్లేస్ చేస్తాడనుకున్న ఓపెనర్ విల్‌ పుకోవ్‌స్కీ 26 ఏళ్లకే రిటైర్మెంట్

Galeti Rajendra HT Telugu

Will Pucovski Records: ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఆశాకిరణంలా కనిపించిన యంగ్ ఓపెనర్ విల్‌ పుకోవ్‌స్కీ 26 ఏళ్లకే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ గుడ్ బై చెప్పేశాడు. మైదానంలో పదే పదే కంకషన్‌కి గురవుతుండటంతో ఆటని వదిలేయాలని వైద్యులు సూచించడంతో విల్‌ పుకోవ్‌స్కీ రిటైర్మెంట్ ప్రకటించేశాడు.

జస్‌ప్రీత్ బుమ్రా, విల్‌ పుకోవ్‌స్కీ (Getty Images)

Australian Cricketer Will Pucovski Retirement: ఆస్ట్రేలియా విధ్వంసక మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేేసే ఓపెనర్‌గా వెలుగులోకి వచ్చిన విల్‌ పుకోవ్‌స్కీ తన కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించేశాడు. భారత్‌తో జరిగిన అరంగేట్రం టెస్టులోనే హాఫ్ సెంచరీతో సత్తాచాటిన 26 ఏళ్ల విల్‌ పుకోవ్‌స్కీ, వరుస గాయాలతో క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన బ్యాటింగ్ రికార్డులు నెలకొల్పిన విల్‌ పుకోవ్‌స్కీ.. ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేస్తాడని అంతా ఊహించారు. కానీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తలకి పదే పదే గాయాలు కావడంతో ఇప్పటికే పలు మార్లు కంకషన్‌కి గురయ్యాడు. ఆ దెబ్బలు అతని మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపడంతో వైద్యుల నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.


హాఫ్ సెంచరీతో వెలుగులోకి

2021లో సిడ్నీ వేదికగా భారత్‌తో ఫస్ట్ టెస్టు మ్యాచ్‌ ఆడిన 62 పరుగులతో సత్తాచాటాడు. కానీ ఆ మ్యాచ్‌లో ఆడుతూనే గాయపడ్డాడు. దాంతో 6 నెలలు ఆటకి దూరంగా ఉండక తప్పలేదు. ఆ తర్వాత కూడా అతడ్ని గాయాలు వరుసగా వేధిస్తూనే ఉన్నాయి.

2024 మార్చిలో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో రిలే మెరిడిత్ విసిరిన బౌన్సర్‌ విల్‌ పుకోవ్‌స్కీ‌ హెల్మెట్‌కి తాకడంతో కంకషన్‌కి గురయ్యాడు. ఆ తర్వాత విల్‌ పుకోవ్‌స్కీ కోలుకోలేకపోయాడు. గత నాలుగేళ్ల వ్యవధిలో ఏకంగా పదిసార్లు పైగా అతను ఇలా కంకషన్‌కి గురయ్యాడు. దాంతో అతని మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింది.

ఒక్క టీ20 కూడా ఆడలేదు

విక్టోరియా తరఫున 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన విల్‌ పుకోవ్‌స్కీ 45.19 సగటుతో ఏడు సెంచరీలు నమోదు చేసి 2,350 పరుగులు చేశాడు. 2020-21లో మెల్‌బోర్న్ స్టార్స్ నుంచి ఆఫర్ అందుకున్నప్పటికీ బిగ్‌బాష్ లీగ్ ఆరంభం నుంచి అతను టీ20 క్రికెట్ ఆడలేకపోయాడు. చివరికి కెరీర్ మొత్తంలో కూడా ఒక్క టీ20 మ్యాచ్‌ను కూడా ఆడలేకపోవడం గమనార్హం.

షెఫీల్డ్ షీల్డ్‌లో విక్టోరియా తరఫున రెండు డబుల్ సెంచరీలు సాధించిన విల్‌ పుకోవ్‌స్కీ భారత్‌తో తలపడే టెస్ట్ జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ దురదృష్టం అతడ్ని వెంటాడింది. ఆస్ట్రేలియా-ఎ జట్టుకి ఆడుతున్న సమయంలో బంతి హెల్మెట్‌కు తగిలి మళ్లీ కంకషన్‌కు గురయ్యాడు.