IND vs AUS 2024: భారత్‌పైకి కొత్త ఆల్‌రౌండర్‌ని ప్రయోగించబోతున్న ఆస్ట్రేలియా.. అతని రికార్డులు చూస్తే..?
Australia squad for 2nd Test vs India: పెర్త్ టెస్టులో భారత్ ముందు బోల్తా కొట్టిన ఆస్ట్రేలియా టీమ్.. రెండో టెస్టు కోసం కొత్త ఆల్‌రౌండర్‌ని జట్టులోకి పిలిపించింది. ఇప్పటి వరకూ ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడిన అనుభవం లేని ఆ ఆల్‌రౌండర్ రికార్డులు చూస్తే మాత్రం..?
భారత్ చేతిలో పెర్త్ టెస్టులో చిత్తుగా ఓడిపోయిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టు ముంగిట జట్టులోకి కొత్త ఆల్‌రౌండర్‌ని తీసుకుంది. పెర్త్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టులో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ ముందు తేలిపోయిన ఆస్ట్రేలియా టీమ్ 295 పరుగుల భారీ తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. దాంతో ఐదు టెస్టుల ఈ బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి ప్రారంభంకానుంది.
ఆస్ట్రేలియా టీమ్‌లో లోటు
ఈ రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా జట్టులోకి కొత్త ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చేర్చింది. గత రెండేళ్లుగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో సత్తాచాటుతున్న ఈ 30 ఏళ్ల ఆల్‌రౌండర్.. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఒంటిచేత్తో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న టాస్మేనియాని గెలిపిస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో ఇప్పుడు ఆల్‌రౌండర్ లోటు కనిపిస్తోంది. దానికి తోడు పెర్త్ టెస్టులో మిచెల్ మార్ష్ గాయపడ్డాడు. దాంతో ఆగమేఘాల మీద వెబ్‌స్టర్‌ని జట్టులోకి తీసుకున్నారు.
వెబ్‌స్టర్ రికార్డులిలా
గత రెండేళ్లుగా షెఫీల్డ్ షీల్డ్ టీమ్‌కి ఆడుతున్న వెబ్‌స్టర్.. ఇప్పటి వరకు 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో 1,788 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్.. ఇటీవల భారత్-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో అతను 72.50 సగటుతో 145 పరుగులు చేయడమే కాదు.. 7 వికెట్లు కూడా ఖాతాలో వేసుకున్నాడు.
కవర్ చేసిన ఆసీస్ కోచ్
వాస్తవానికి రెండో టెస్టు కోసం వెబ్‌స్టర్‌ను పిలిపించారు. దాంతో ఆస్ట్రేలియా టీమ్ భయపడుతోందని సంకేతాలు వెళ్లడంతో.. కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కవరింగ్ చేసే ప్రయత్నం చేశాడు. రెండో టెస్టుకి జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని సంకేతాలిచ్చాడు. కేవలం మార్ష్ గాయం కారణంగా ముందు జాగ్రత్తల్లో భాగంగా అతడ్ని జట్టులోకి తీసుకున్నట్లు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఒకవేళ అడిలైడ్ టెస్టులో వెబ్‌స్టర్‌ను ఆడించలేకపోతే.. మూడో టెస్టులో కచ్చితంగా బరిలోకి దింపే అవకాశం ఉంటుంది.
ఆస్ట్రేలియా టెస్టు జట్టు
ఉస్మాన్ ఖవాజా, మెక్‌స్వీని, మార్కస్ లబుషేన్, స్టీవ్‌స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హేజిల్‌వుడ్, బ్యూ వెబ్‌స్టర్