ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ లో విదేశీ స్టార్ల కల తగ్గే ఛాన్స్ ఉంది. డబ్ల్యూటీసీ 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. జూన్ 11న లార్డ్స్ లో ఈ ఫైనల్ టెస్టు స్టార్ట్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మే 29 నుంచి ప్లేఆఫ్స్, జూన్ 3న ఫైనల్ జరుగనుంది.
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్, ఫైనల్ కు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సఫారీ ఆటగాళ్లు ఆడటం డౌటే. ఐపీఎల్ లో ఆడే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మే 26న తిరిగి జాతీయ జట్టుతో చేరాలని కోరుకుంటున్నట్లు ప్రొటీస్ హెడ్ కోచ్ షుక్రీ కాన్రాడ్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ మే 29న స్టార్ట్ అవుతాయి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా జూన్ 3 నుంచి 6 వరకు అరుండేల్ వేదికగా జింబాబ్వేతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సీఎస్ఏ ఇప్పటికే 15 మంది సభ్యుల జట్టును ప్రకటించగా.. ఇందులో ఎంపికైన కగిసో రబాడ, మార్కో యాన్సెన్, ట్రిస్టాన్ స్టబ్స్ సహా ఏడుగురు సభ్యులు ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్నారు.
మే 26 డెడ్ లైన్ గురించి కాన్రాడ్ మాట్లాడుతూ "మా దృక్పథంలో ఏమీ మారలేదు. మే 26వ తేదీన తమ ఆటగాళ్లు తిరిగి రావాలని కోరుకుంటున్నాం. అదే జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని చెప్పాడు.
క్రికెట్ దక్షిణాఫ్రికా హై ఫర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఎనోచ్ ఎన్క్వే కూడా జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు మే 26 లోగా తిరిగి రావాల్సి ఉందని పేర్కొన్నాడు.
"మేము ఒక విషయాన్ని స్పష్టం చేశాం మేము దీనిని ఐపీఎల్, బీసీసీకు చెప్తాం. డబ్ల్యూటీసీ సన్నాహకాల విషయానికి వస్తే మా అసలు ప్రణాళికకు కట్టుబడి ఉన్నా. మే 26 టెస్ట్ కుర్రాళ్లు తిరిగి రావాల్సిందే. దీనికే తొలి ప్రాధాన్యత. డబ్ల్యూటీసీ ఫైనల్ కాబట్టి అసలు ప్రణాళికలు మారవు. మేమంతా ఒకే తాటిపై ఉండేలా గత ఒకట్రెండు రోజులుగా వారితో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని డైరెక్టర్ తెలిపాడు.
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ పై ఫోకస్ పెట్టింది. ఆ టీమ్ ప్లేయర్స్ కూడా ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ కు దూరమయ్యే అవకాశముంది. మిచెల్ స్టార్క్ (ఢిల్లీ క్యాపిటల్స్), హేజిల్ వుడ్ (ఆర్సీబీ), కమిన్స్, హెడ్ (సన్ రైజర్స్ హైదరాబాద్), ఇంగ్లిస్ (పంజాబ్ కింగ్స్) లాంటి ఆటగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే ఆసీస్ టీమ్ కు సెలక్టయ్యారు.
సంబంధిత కథనం