Australia All out: పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం.. టీమిండియా పుంజుకుంటుందా?
Australia All out: పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం లభించింది. ట్రావిస్ హెడ్ సెంచరీతో ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 157 పరుగుల లీడ్ రావడంతో టీమిండియా ఇక కోలుకోవడం అంత సులువు కాకపోవచ్చు.
Australia All out: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా, సిరాజ్ చెరో నాలుగు వికెట్లతో రాణించినా.. ట్రావిస్ హెడ్ సెంచరీ, లబుషేన్ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ లో 157 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
హెడ్ సెంచరీ.. ఆస్ట్రేలియాకు లీడ్
అడిలైడ్ లో జరుగుతున్న డేనైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 180 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా మాత్రం ట్రావిస్ హెడ్ (140) సెంచరీ, లబుషేన్ (64) హాఫ్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆలౌటైంది. ఇండియా తరఫున బుమ్రా, సిరాజ్ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు.
నితీష్ కుమార్ రెడ్డి, అశ్విన్ చెరొక వికెట్ తీయగా.. కొత్త బౌలర్ హర్షిత్ రాణా వికెట్ తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో లభించిన ఈ భారీ ఆధిక్యంతో రెండో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇక్కడి నుంచి కోలుకొని టీమిండియా మళ్లీ గాడిలో పడటం అంత సులువైన పనిలా కనిపించడం లేదు. రెండో ఇన్నింగ్స్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ లో గట్టెక్కడం సాధ్యం కాకపోవచ్చు.
ట్రావిస్ హెడ్ వరల్డ్ రికార్డు
టీమిండియా అంటేనే చెలరేగిపోయే ట్రావిస్ హెడ్ మరోసారి మన బౌలర్లకు చుక్కలు చూపించాడు. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మరోసారి గుర్తు చేస్తూ.. అడిలైడ్ లో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో సెంచరీ బాదాడు. రెండో రోజు ఆటలో హెడ్ కేవలం 111 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. రెండేళ్ల కిందట ఇంగ్లండ్ పై 112 బంతుల్లో సెంచరీ చేసి నెలకొల్పిన తన రికార్డును తానే తిరగరాశాడు.
అడిలైడ్ లోనే 2022లో వెస్టిండీస్ తో జరిగిన మరో డేనైట్ టెస్టులోనూ హెడ్ 125 బంతుల్లో సెంచరీ చేశాడు. అడిలైడ్ లో అతనికిది మూడో సెంచరీ. రెండో రోజు తొలి సెషన్ లో స్మిత్ కేవలం 2 పరుగులకే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హెడ్.. అలవోకగా ఇండియన్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఇండియన్ పేసర్లను అటాక్ చేస్తూ ఒత్తిడిలోకి నెట్టాడు. బుమ్రా బౌలింగ్ లో ఆచితూచి ఆడినా.. హర్షిత్ రాణాను చితకబాదాడు.