AUS vs SA: మిల్లర్ వీరోచిత శకతం.. దక్షిణాఫ్రికాను ఆదుకున్న స్టార్ బ్యాటర్.. ఆస్ట్రేలియా ముందు స్వల్ప టార్గెట్
AUS vs SA World Cup 2023 Semi Final: ప్రపంచకప్ సెమీఫైనల్‍లో దక్షిణాఫ్రికాను మోస్తరు స్కోరుకే ఆస్ట్రేలియా కట్టడి చేసింది. డేవిడ్ మిల్లర్ శతకం చేయడంతో దక్షిణాఫ్రికా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఆసీస్ ముందు స్వల్ప టార్గెట్ ఉంది.
AUS vs SA World Cup 2023 Semi Final: వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‍లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‍లో తడబడింది. సఫారీ బ్యాటింగ్ లైనప్‍ను ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేశారు. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101 పరుగులు) ఒంటరి పోరాటంతో వీరోచిత శకతం చేసి దక్షిణాఫ్రికాకు పోరాడే స్కోరు అందించాడు. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ (47) మినహా మిగిలిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. టాప్-3 బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‍కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పరుగులు కట్టడి చేయడంతో పాటు మూడు వికెట్లు దక్కించుకున్నాడు. కమిన్స్ మూడు, హేజిల్‍వుడ్, ట్రావిస్ హెడ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియా ముందు 213 పరుగుల టార్గెట్ ఉంది. ఈ సెమీఫైనల్ గెలిచిన జట్టు ఫైనల్‍లో భారత్‍తో తలపడనుంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎలా సాగిందంటే..
టాపార్డర్ టపటపా
దక్షిణాఫ్రికా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి పరుగులు చేసేందుకు సఫారీ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. కెప్టెన్ టెంబా బవూమా (0) తొలి ఓవర్లోనే డకౌట్ కాగా.. క్వింటన్ డికాక్ (3), ఐడెన్ మార్క్ రమ్ (10), రాసీ వాండర్ డుసెన్ (6) వెనువెంటనే ఔటవటంతో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓ దశలో వర్షం కూడా కాసేపు ఆటంకం కలిగించింది. ఆ తర్వాత సమయంలో డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. క్రమంగా పరుగులు రాబట్టారు. 31వ ఓవర్లో క్లాసెన్ (47)ను ఔట్ చేసి ఆసీస్‍కు బ్రేక్‍త్రూ ఇచ్చాడు హెడ్. దీంతో 95 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కూడా మిల్లర్ జోరు కొనసాగించాడు.
శతకంతో ఆదుకున్న మిల్లర్
మార్కో జాన్సెన్ (0) డకౌటైనా మిల్లర్ ఒంటరి పోరు కొనసాగించాడు. గెలార్డ్ కోట్జీ (19) అతడికి కాసేపు సహకారం అందించాడు. మరో ఎండ్‍లో మిల్లర్ వేగం పెంచాడు. క్రమంగా హిట్టింగ్ చేశాడు. బౌండరీలు బాదాడు. కేశవ్ మహారాజ్ (4) కూడా వెంటనే ఔటయ్యాడు. దూకుడు కొనసాగించిన మిల్లర్ 115 బంతుల్లో శతకానికి చేరాడు. సిక్స్‌తో సెంచరీకి చేరి సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే మరో భారీ షాట్‍కు ప్రత్నించి క్యాచౌటయ్యాడు. మొత్తంగా శతకంతో దక్షిణాఫ్రికాను మిల్లర్ ఆదుకున్నాడు. చివర్లో రబాడ (10) కొన్ని పరుగులు జత చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 212 పరుగులు చేయగలిగింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు సెమీఫైనల్ గెలవని దక్షిణాఫ్రికా ఈ స్వల్ప టార్గెట్‍ను కాపాడుకోగలదా అన్నది చూడాలి.