Asia Cup Final: సిరాజ్ దెబ్బకు లబోదిబోమన్న లంక.. 50 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేసిన భారత్
Asia Cup Final IND vs SL: ఆసియాకప్ 2023 ఫైనల్‍లో శ్రీలంకను కుప్పకూల్చింది టీమిండియా. కేవలం 50 పరుగులకే చాపచుట్టేసింది లంక. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో సత్తాచాటాడు.
Asia Cup Final IND vs SL: ఆసియాకప్ 2023 ఫైనల్‍లో టీమిండియా అద్భుతం చేసింది. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగటంతో శ్రీలంక లబోదిబోమంది. కొలంబో వేదికగా జరుగుతున్న ఆసియాకప్ కప్ ఫైనల్‍లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ (6/21) ఆరు వికెట్లతో దుమ్మురేపి.. లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. హార్దిక్ పాండ్యా మూడు, జస్‍ప్రీత్ బుమ్రా ఓ వికెట్ తీశారు. శ్రీలంక బ్యాటర్లలో కుషాల్ మెండిస్ (17), దసన్ హేమంత (13) మినహా మిగిలిన తొమ్మిది మంది సింగిల్ డిజిట్‍కే ఔటయ్యారు. టీమిండియా ముందు కేవలం 51 పరుగుల లక్ష్యం ఉంది.
తొలుత బ్యాటింగ్‍కు దిగిన శ్రీలంకకు తొలి ఓవర్లనే షాకిచ్చాడు భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా. మూడో బంతికే కుషాల్ పెరీరా (0)ను పెవిలియన్‍కు పంపాడు. ఇక నాలుగో ఓవర్లో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతం చేశాడు. పాతుమ్ నిస్సంక (2), సదీర సమరవిక్రమ (0), చరిత్ అసలంక (0), ధనుంజయ డిసిల్వ (4)ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 4 ఓవర్లలోనే 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. ఆ తర్వాత ఆరో ఓవర్లోనూ లంక కెప్టెన్ దసున్ శనకను సిరాజ్ బౌల్డ్ చేశాడు. దీంతో 12 రన్స్ వద్దే లంక ఆరో వికెట్ కోల్పోయింది. వన్డేల్లో సిరాజ్ తన తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశారు. తన తొలి 16 బంతుల్లోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో, వన్డే క్రికెట్‍లో అత్యంత వేగంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా చమింద వాస్ (16 బంతులు) రికార్డును సిరాజ్ సమం చేశాడు. ఆ తర్వాత కుషాన్ మెండిస్‍ను కూాడా ఔట్ చేసి.. ఆరో వికెట్ దక్కించుకున్నాడు సిరాజ్.
ఆ తర్వాత భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చెలరేగాడు. దునిల్ వెల్లలాగే (8), ప్రమోద్ మధుషన్ (1), మతీష పతిరణ (0)ను పాండ్యా ఔట్ చేశాడు. దీంతో 15.2 ఓవర్లలోనే శ్రీలంక 50 పరుగులకు ఆలౌటైంది.