Asia Cup Final Records: ఆసియాకప్ ఫైనల్‍లో నమోదైన రికార్డులు ఇవే.. లంకపై భారత్ భారీ గెలుపు
Asia Cup Final Records: ఆసియాకప్ 2023 ఫైనల్‍లో శ్రీలంకపై భారత్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‍లో కొన్ని రికార్డులు కూడా నమోదయ్యాయి. ఆ వివరాలివే..

Asia Cup Final Records: ఆసియాకప్ 2023 ఫైనల్‍లో భారత్ విజయభేరీ మోగించింది. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. కొలంబో వేదికగా ఆదివారం (సెప్టెంబర్ 17) జరిగిన మ్యాచ్‍లో 263 బంతులను మిగిల్చి 6.1 ఓవర్లలోనే టార్గెట్‍ను ఛేదించి గెలిచింది భారత్. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో విజృంభించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత 6.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 51 పరుగులు చేసి టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్‍లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. వాటి వివరాలివే..
ఆసియాకప్ ఫైనల్‍లో నమోదైన ముఖ్యమైన రికార్డులు ఇవే
- ఆసియాకప్ టైటిల్‍ను టీమిండియా 8వసారి కైవసం చేసుకుంది. ఆసియాకప్ ట్రోఫీని ఎక్కువసార్లు గెలిచిన టీమ్‍గా రికార్డును కొనసాగించింది భారత్.
- వన్డే చరిత్రలో ఓ మ్యాచ్‍లో అత్యంత వేగంగా (16 బంతులు) 5 వికెట్లను పడగొట్టిన రికార్డును భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ సమం చేశాడు. 2003లో లంక పేసర్ చమింద వాస్ ఓ వన్డే మ్యాచ్ తొలి 16 బంతుల్లో ఐదు వికెట్లు తీశాడు. ఇప్పుడు 10ఏళ్ల తర్వాత ఆ రికార్డును సిరాజ్ సమం చేశాడు.
- వన్డే మ్యాచ్‍లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‍గా నాలుగో బౌలర్‌గా ఉన్నాడు.
- ఈ మ్యాచ్‍ను 263 బంతులు మిగిల్చి గెలిచింది టీమిండియా. వన్డే క్రికెట్‍లో ఛేజింగ్‍లో బంతుల పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం.
- వన్డే క్రికెట్‍లో అత్యంత వేగంగా 50 వికెట్లను (1002) తీసిన రెండో బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. అజంతా మెండిస్ ఫస్ట్ ప్లేస్‍లో ఉన్నాడు.
- శ్రీలంక ఈ మ్యాచ్‍లో 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. వన్డే చరిత్రలో ఆ జట్టుకు ఇది రెండో అత్యల్ప స్కోరు. 2012 దక్షిణాఫ్రికాపై 42 పరుగులకే లంక ఆలౌటైంది.
- ఓ వన్డేలో ఆరు వికెట్లు పడగొట్టిన 11వ భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.
- మహమ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ తర్వాత రెండుసార్లు ఆసియాకప్ టైటిల్ గెలిచిన మూడో భారత కెప్టెన్‍గా రోహిత్ శర్మ నిలిచాడు.
ఆసియాకప్ 2023 ఫైనల్‍లో ఆరు వికెట్లతో సత్తాచాటిన భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్‍కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్ సొంతం చేసుకున్నాడు.