IND vs SL: 37 బంతుల్లోనే గెలిచిన టీమిండియా.. 8వసారి ఆసియాకప్ టైటిల్ కైవసం.. ఆ రికార్డు పదిలం
IND vs SL: ఆసియాకప్ 2023 ఫైనల్‍లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయం సాధించింది. 8వసారి ఆసియాకప్ టైటిల్‍ను భారత్ కైవసం చేసుకుంది.
IND vs SL: ఆసియాకప్ 2023 ఫైనల్‍లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి 8వ సారి ఆసియాకప్ టైటిల్‍ను టీమిండియా దక్కించుకుంది. శ్రీలంకలోని కొలంబోలో నేడు (సెప్టెంబర్ 17) జరిగిన ఆసియాకప్ 2023 ఫైనల్‍లో టీమిండియా 10 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. 37 బంతుల్లోనే టార్గెట్ చేజ్ చేసి గెలిచింది రోహిత్ సేన. 51 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలో ఛేదించింది. భారత ఓపెనర్లు శుభ్‍మన్ గిల్ (27 నాటౌట్), ఇషాన్ కిషన్ (23 నాటౌట్) దూకుడుగా ఆడి టీమిండియాను అలవోకగా గెలిపించారు. 6.1 ఓవర్లలో టీమిండియా వికెట్ కోల్పోకుండా 51 పరుగులు చేసింది. 263 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. అంతకు ముందు శ్రీలంక 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆలౌటైంది. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసి శ్రీలంకను కుప్పకూల్చాడు. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో రాణించగా.. జస్‍ప్రీత్ బుమ్రా ఓ వికెట్ తీశాడు. లంక బ్యాటర్లలో ఒక్కరు కూడా 20 పరుగులు చేయలేకపోయారు.
ఆసియా రికార్డు భారత్‍దే
శ్రీలంకతో ఈ ఫైనల్ గెలుపుతో ఆసియాకప్ టైటిల్‍ను భారత్ 8వసారి కైవసం చేసుకుంది. అత్యధిక ఆసియాకప్ ట్రోఫీలు సాధించిన జట్టుగా రికార్డును పదిలం చేసుకుంది. ఇప్పటివరకు శ్రీలంక ఆరుసార్లు ఆసియా టైటిల్‍ను గెలిచింది.
గిల్, ఇషాన్ అలోవకగా..
51 పరుగుల లక్ష్యమే ఉండటంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్‍కు రాకుండా.. శుభ్‍మన్ గిల్‍తో పాటు ఇషాన్ కిషన్‍ను పంపాడు. ఈ ఇద్దరు స్వల్ప లక్ష్యాన్ని ధాటిగా ఛేదించారు. శ్రీలంక బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వీలైనప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో 6.1 ఓవర్లలోనే భారత్ 51 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. 263 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించి.. ఆసియాకప్ టైటిల్‍ను దక్కించుకుంది.
నిప్పులు చెరిగిన సిరాజ్
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన శ్రీలంకకు భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చుక్కలు చూపించాడు. నిప్పులు చెరిగే స్వింగ్ బౌలింగ్‍తో లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కూల్చేశాడు. తొలి ఓవర్లో భారత పేసర్ బుమ్రా.. శ్రీలంక ఓపెనర్ కుషాల్ పెరీరా (0)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ సత్తాచాటాడు. నాలుగో ఓవర్లో పాతుమ్ నిస్సంక (2), సదీర సమరవిక్రమ (0), చరిత్ అసలంక (0), ధనుంజయ డిసిల్వ (4)ను సిరాజ్ పెవిలియన్‍కు పంపాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆరో ఓవర్లో లంక కెప్టెన్ దసున్ శనకను సిరాజ్ బౌల్డ్ చేశాడు. దీంతో 12 పరుగులకే శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. వన్డేల్లో సిరాజ్ తన తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాత 12వ ఓవర్లో కుషాల్ మెండిస్(17)ను కూడా ఔట్ చేశారు సిరాజ్ మియా. భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. దునిత్ వెల్లలాగే (8), ప్రమోద్ మధుషన్ (1), మతీష పతిరణ (0)ను ఔట్ చేశాడు. హేమంత (13) నాటౌట్‍గా నిలిచాడు. దీంతో 15.2 ఓవర్లలోనే 50 పరుగులకు శ్రీలంక ఆలౌటైంది. లంక బ్యాటర్లలో తొమ్మిది మంది సింగిల్ డిజిట్‍కే పరిమితమయ్యారు.
వచ్చే నెల 5వ తేదీన భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. అంతకు ముందు జరిగిన ఈ ఆసియాకప్‍లో టీమిండియా సత్తాచాటడం జట్టుకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ తేదీ వరకు భారత్‍లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది.