WPL 2025: ఆష్లీ ఆల్ రౌండ్ జోరు.. ఆర్సీబీ షాక్ నుంచి కోలుకున్న గుజరాత్.. డబ్ల్యూపీఎల్ లో బోణీ
WPL 2025: డబ్ల్యూపీఎల్ 2025లో గుజరాత్ జెయింట్స్ పుంజుకుంది. తొలి మ్యాచ్ లో 201 చేసినా ఆర్సీబీ చేతిలో కంగుతిన్న గుజరాత్ ఈ సీజన్ లో బోణీ కొట్టింది. యూపీ వారియర్స్ పై గెలిచింది.

డబ్ల్యూపీఎల్ 2025లో గుజరాత్ జెయింట్స్ కు తొలి గెలుపు. గత మ్యాచ్ లో ఆర్సీబీ 202 టార్గెట్ ను ఛేజ్ చేయడంతో ఓటమి వైపు నిలిచిన గుజరాత్.. ఈ సారి ఆల్ రౌండ్ ప్రదర్శనతో మెరిసింది. ఆదివారం (ఫిబ్రవరి 16) యూపీ వారియర్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట యూపీ 143/9 స్కోరు చేసింది. ఛేదనలో గుజరాత్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
ఆష్లీ అదుర్స్
గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ ఆష్లీ గార్డ్ నర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించింది. మొదట బౌలింగ్ లో రెండు వికెట్లు తీసిన ఆమె.. ఆ తర్వాత బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీతో మెరిసింది. 32 బంతుల్లోనే 52 పరుగులు చేసి జట్టును గెలుపు బాట పట్టించింది. 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదింది. ఓ మోస్తారు ఛేదనలో ధనాధన్ ఇన్నింగ్స్ తో డబ్ల్యూపీఎల్ 2025లో జట్టుకు తొలి విజయాన్ని అందించింది. ఆమెకు ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ.
మొదట తడబడ్డా
ఛేదనలో మొదట గుజరాత్ తడబడింది. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ఆష్లీ ఎదురు దాడికి దిగింది. లారా వోల్వార్ట్ (22)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించింది. లారా ఔటైనా ఆష్లీ బౌండరీల వేట కొనసాగించింది. సాధించాల్సిన లక్ష్యాన్ని కరిగించింది. హాఫ్ సెంచరీ తర్వాత ఆష్లీ పెవిలియన్ చేరినా.. హర్లీన్ (34 నాటౌట్), డాటిన్ (33 నాటౌట్) కలిసి పని పూర్తి చేశారు.
మెరుపుల్లేకుండా
మొదట యూపీ వారియర్స్ బ్యాటింగ్ లో పెద్దగా మెరుపులేమీ లేవు. కెప్టెన్ దీప్తి శర్మ (39), ఉమా ఛెత్రి (24) రాణించడంతో యూపీ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ప్రియ మిశ్రా (3/25), డాటిన్ (2/34), ఆష్లీ గార్డ్ నర్ (2/39) సమష్టిగా రాణించి యూపీని కట్టడి చేశారు. 22కే 2 వికెట్లు కోల్పోయిన యూపీని దీప్తి, ఉమా ఆదుకున్నా వేగంగా పరుగులు చేయలేకపోయారు. ఏ దశలోనూ ఇన్నింగ్స్ జోరు అందుకోలేదు.
సంబంధిత కథనం