టీ20ల్లో స్టార్ పేసర్ గా కొనసాగుతున్న అర్ష్‌దీప్ సింగ్ తన సత్తా ఏంటో మరోసారి చాటాడు. మూడు వికెట్లతో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఆర్డర్ ను కూల్చాడు. అర్ష్‌దీప్ అద్భుత బౌలింగ్ తో ఆదివారం (మే 4) ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో లక్నోను ఓడించింది.
237 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లక్నో తేలిపోయింది. ఆ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆయుష్ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాటం ఫలితాన్నివ్వలేదు. అర్ష్‌దీప్‌తో పాటు అజ్మతుల్లా ఒమర్ జాయ్ (2/33) లక్నో పని పట్టారు. 11 మ్యాచ్ ల్లో ఏడో విజయంతో పంజాబ్ ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు వేసింది. 11 మ్యాచ్ ల్లో ఆరో ఓటమితో లక్నో పరిస్థితి కాస్త క్లిష్టంగా మారింది.
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ పై ఛేజింగ్ లో లక్నోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. అర్ష్‌దీప్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే మిచెల్ మార్ష్ (0), మార్ క్రమ్ (13)ను ఔట్ చేశాడు. తన తర్వాతి ఓవర్లో నికోలస్ పూరన్ (6)ను పెవిలియన్ చేర్చాడు అర్ష్‌దీప్. ఈ సీజన్ లో లక్నో తరపున కాస్తో కూస్తో రాణిస్తున్న ఈ ముగ్గురినీ వెనక్కిపంపి అర్ష్‌దీప్.. ఆ టీమ్ ను చావుదెబ్బ తీశాడు.
ఛేదన ఆరంభంలోనే అర్ష్‌దీప్ కొట్టిన షాక నుంచి లక్నో కోలుకోలేకపోయింది. ఇక అజ్మతుల్లా ఒమర్ జాయ్ తన వరుస ఓవర్లలో కెప్టెన్ పంత్ (18), డేవిడ్ మిల్లర్ (11)ను ఔట్ చేశాడు. అత్యంత దారుణ ప్రదర్శన కొనసాగిస్తూ పంత్ మరోసారి వికెట్ పారేసుకున్నాడు. 10 ఓవర్లకు 74/5తో లక్నో ఓటమి ఖాయమైంది.
జట్టును గెలిపించాలంటే అద్భుతం చేయాల్సిన పరిస్థితుల్లో ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడారు. భారీ షాట్లతో పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారు. కానీ సాధించాల్సిన రన్ రేట్ 20 దాటిపోవడంతో ఈ బ్యాటర్లపై తీవ్రమైన ప్రెషర్ పడింది. ముఖ్యంగా సమద్ ఓ దశలో 200 స్ట్రైక్ రేట్ తో ఆడిన లాభం లేకపోయింది.
సమద్ ను యాన్సెన్ ఔట్ చేయగా.. బదోని హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఆఖర్లో బదోని మరింతగా చెలరేగాడు. అలవోకగా సిక్సర్లు కొట్టాడు. కానీ లక్నోను గెలిపించేందుకు అవి సరిపోలేదు. లాస్ట్ ఓవర్లో అతణ్ని చాహల్ ఔట్ చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ రెచ్చిపోయింది. లక్నో బౌలింగ్ ను చితక్కొట్టింది. పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 236 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగాడు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శశాంక్ సింగ్ (15 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, ఓ సిక్సర్) కూడా అదరగొట్టారు. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్, దిగ్వేష్ రతి చెరో రెండు వికెట్లు తీశారు.
సంబంధిత కథనం