బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయి, 50 మందికి పైగా గాయపడిన ఘటన జరిగిన మరుసటి రోజే అంటే గురువారం (జూన్ 5) విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే కోహ్లి వెళ్లిపోవడంపై సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిన్నటి నుంచి #arrestKohli టాప్ ట్రెండ్‌లలో ఒకటిగా నిలిచింది.
విరాట్ కోహ్లి లండన్ ప్రయాణ ప్రణాళికలకు అనుగుణంగానే బుధవారమే (జూన్ 4) విజయోత్సవాలు నిర్వహించారని చాలా మంది నెటిజన్లు ఆరోపించారు. ఒక సోషల్ మీడియా పోస్ట్ తప్ప ఈ విషాదంపై అతడు పెద్దగా స్పందించలేదని కొందరు ఎత్తిచూపడంతో క్రికెటర్‌పై ఆగ్రహావేషాలు పెరిగిపోతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ దీనిపై స్పందించాడు.
"ఈ సంఘటన గురించి విని తీవ్రంగా బాధపడ్డాను. బాధితుల కుటుంబాలకు, ఆత్మీయులకు నా సానుభూతి" అని కోహ్లి అన్నాడు. అయితే పరిస్థితి తీవ్రత దృష్ట్యా అతని వైపు నుండి మరింత స్పందన లేకపోవడం చాలా మందిని తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఎక్స్‌లో #arrestKohli రెండు రోజులుగా టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
మరోవైపు ఆర్సీబీ విజయోత్సవాల నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే ముంబైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఈవెంట్ నిర్వహణ బాధ్యత వహించిన DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఆర్సీబీ జట్టు, DNA ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ)లోని కీలక ప్రతినిధులపై నేరపూరిత హత్యతో సహా పలు అభియోగాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద, పలువురు ఇతర సీనియర్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కార్యక్రమం గురించి ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ.. కమిషనర్ కార్యాలయం లిఖితపూర్వక తిరస్కరణ ఇవ్వడంలో లేదా భారీ జనసమూహాన్ని మేనేజ్ చేయడానికి సిద్ధంగా ఉండటంలో విఫలమైందని పేర్కొంది.
కర్ణాటక ప్రభుత్వం, ఆర్సీబీ దిద్దుబాటు చర్యలు, నష్టపరిహారం ప్రకటనలాంటివి ఎలా ఉన్నా.. నెటిజన్లు మాత్రం విరాట్ కోహ్లినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇంత తీవ్ర విషాదంపై కోహ్లి స్పందించిన తీరు వాళ్లను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. అంతేకాదు వెంటనే దేశం వదిలి వెళ్లిపోవడాన్నీ వాళ్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
నిజానికి ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలిచినా.. లక్షలాది మంది అభిమానులు రోడ్లపైకి రావడానికి మాత్రం కారణం విరాట్ కోహ్లియే. అతన్ని చూడటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. స్టేడియంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు.
సంబంధిత కథనం