ఐపీఎల్ 2025లో ఫస్ట్ ఆడిన ఆరు మ్యాచ్ ల్లో వరుసగా ఫెయిల్ అయిన రోహిత్ శర్మ ఇప్పుడు వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదేశాడు. సీఎస్కేతో మ్యాచ్ లో ఫామ్ అందుకున్న హిట్ మ్యాన్ బుధవారం (ఏప్రిల్ 23) ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ పై చెలరేగాడు. దీంతో ముంబయి ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 3 వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది.
9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో రోహిత్ శర్మ వరుసగా రెండు ఫిఫ్టీస్ సాధించాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో అతను 46 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి. సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా వీర విహారం చేశాడు. 8 మ్యాచ్ ల్లో ఆరో ఓటమితో సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా ఆవిరైనట్లే. ముంబయి అయిదో విజయంతో మూడో ప్లేస్ కు దూసుకెళ్లింది.
ఐపీఎల్ 2025లో సీఎస్కేతో గత మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చిన హిట్ మ్యాన్ రోహిత్ మరోసారి దంచికొట్టాడు. సన్ రైజర్స్ బౌలింగ్ ను చిత్తు చేశాడు. ఈ ఓపెనర్ భారీ షాట్లతో అలరించాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికిల్టన్ (11) త్వరగానే ఔటయ్యాడు. కానీ విల్ జాక్స్ (22) తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ నిర్మించాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కిందామీద పడుతూ చేసింది 143 పరుగులు. ఛేదనలో ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ చెలరేగడంతో ఆ టార్గెట్ మరీ చిన్నదైపోయింది. తన స్టైల్ పుల్ షాట్లు, లాఫ్టెడ్ షాట్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు రోహిత్. కమిన్స్ బౌలింగ్ లో పుల్ షాట్ తో రోహిత్ కొట్టిన సిక్సర్ చూసి వారెవా అనాల్సిందే.
ఈ సీజన్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ అందుకున్న రోహిత్.. ముంబయిని గెలుపు దిశగా దూసుకెళ్లాడు. విల్ జాక్స్ వికెట్ పడ్డ తర్వాత క్రీజులోకి వచ్చిన మిస్టర్ 360 సూర్యకుమార్ కూడా దంచుడులో పోటీపడ్డాడు. దెబ్బకు టార్గెట్ పరుగెత్తుకుంటూ వచ్చింది. గెలుపు ముంగిట రోహిత్ ఔటైనా.. తిలక్ వర్మతో కలిసి సూర్య పని పూర్తి చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో మరోసారి తడబడింది. హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 71; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటం పుణ్యమా అని మరీ తక్కువ స్కోరుకే పరిమితం కాలేదు. అభినవ్ మనోహర్ (43) కూడా ఓ చేయి వేశాడు. దీంతో 20 ఓవర్లలో సన్ రైజర్స్ 8 వికెట్లకు 143 పరుగులు చేసింది.
ముంబయి ఇండియన్స్ బౌలర్లలో 4 వికెట్లతో సన్ రైజర్స్ ను వణికించాడు బౌల్ట్. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, హార్దిక్ చెరో వికెట్ తీసుకున్నారు.
సంబంధిత కథనం