10కి 10 వికెట్లు.. పాకిస్థాన్ నడ్డి విరిచిన భారత స్పిన్నర్.. కుంబ్లే అసాధారణ ఘనతకు నేటికి 26 ఏళ్లు
Anil Kumble: 26 ఏళ్ల క్రితం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే చావుదెబ్బ కొట్టాడు. ఒక ఇన్నింగ్స్ లో 10కి 10 వికెట్లతో ప్రపంచ క్రికెట్లో ఇదే రోజు (ఫిబ్రవరి 7) సంచలనం సృష్టించాడు. కుంబ్లే మాయాజాలంతో 1999లో ఢిల్లీలో జరిగిన ఆ టెస్టులో భారత్ 212 పరుగుల తేడాతో గెలిచింది.

1999లో ఇదే రోజు (ఫిబ్రవరి 7)న భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు పడగొట్టి టెస్టు క్రికెట్ లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు.
ఆ సిరీస్ రెండో టెస్టులో పాక్ కు 420 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఓపెనర్లు సయ్యద్ అన్వర్, షాహిద్ అఫ్రిది సెంచరీ భాగస్వామ్యంతో ఛేదనలో పాక్ కు బలమైన పునాది పడింది. దీంతో భారత అభిమానుల్లో ఆందోళన. కానీ అప్పుడే కుంబ్లే మాయ మొదలైంది.
కుంబ్లే గేమ్ ఛేంజింగ్ స్పెల్
బంతి అందుకున్న కుంబ్లే అసాధారణ బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అలుపెరగని స్పెల్ బౌలింగ్ చేసి ఒకరి తర్వాత ఒకరిగా పాక్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. కచ్చితత్వం, నియంత్రణతో 26.3 ఓవర్లలో 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. పాక్ కెప్టెన్ వసీం అక్రమ్ ను ఔట్ చేయడంతో కుంబ్లే ఈ సంచలన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
ఏకైక భారత బౌలర్
అప్పటికీ టెస్టు క్రికెట్లో ఓ ఇన్నింగ్స్ లో 10 కి 10 వికెట్లు పడగొట్టింది కేవలం జిమ్ లేకర్ మాత్రమే. ఈ ఇంగ్లండ్ బౌలర్ 1956లో ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత 10 వికెట్లు పడగొట్టింది కుంబ్లేనే. ఆ తర్వాత 2021లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ భారత్ పై ఈ రికార్డు సాధించడం గమనార్హం. అయితే టెస్టు ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టిన ఏకైక భారత బౌలర్ గా ఇప్పటికీ కుంబ్లేనే కొనసాగుతున్నాడు.
కుంబ్లే విజయం
కుంబ్లే ప్రదర్శనతో పాకిస్థాన్ పై జట్టు సాధించిన విజయం భారత క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది. ఎందుకంటే 1979-80 నుంచి టెస్టుల్లో భారత్ పాక్ చేతిలో వరుసగా ఓడిపోతూ వచ్చింది. 23 టెస్టుల్లో (ఆసియా టెస్టు ఛాంపియన్ షిప్ కలిపి) పాక్ పై టీమ్ ఇండియాకు విజయమే లేదు. దాయాది చేతిలో జట్టు చిత్తవుతుంటే టీమ్ ఇండియా అభిమానులు ఆవేదన చెందారు. కానీ కుంబ్లే హీరోచిత బౌలింగ్ తో భారత్ గెలిచింది. అందుకే కుంబ్లే ప్రదర్శన, జట్టు విజయం భారత అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.