Nitish Reddy: నితీష్ రెడ్డి.. ఐపీఎల్ 2024కు ముందు ఈ క్రికెటర్ పేరు తెలిసిన వాళ్లు మన తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా తక్కువే. కానీ ఈ సీజన్లో తన ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఐపీఎల్ మెరుపుల తర్వాత ఇండియన్ టీమ్ కు కూడా ఎంపికయ్యాడు. దురదృష్టవశాత్తూ గాయం వల్ల తన తొలి టూర్ ఆడలేకపోయినా.. తన విజయవంతమైన క్రికెట ప్రయాణం గురించి క్రికిన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఆంధ్రా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి గురించి ఇప్పుడు ఏపీ, తెలంగాణాల్లోనే కాదు ఇండియాలోనూ చాలా మందికి తెలుసు. ఒక్క ఐపీఎల్ సీజన్ తోనే అతని రేంజ్ అలా పెరిగిపోయింది. అయితే ఒకప్పుడు తన క్రికెట్ కెరీర్ కోసం తన ఉద్యోగాన్ని త్యాగం చేసిన తన తండ్రిని అందరూ ఎలా హేళనగా మాట్లాడారో గుర్తు చేసుకుంటూ నితీష్ ఇప్పుడు ఎమోషనల్ అయ్యాడు.
నితీష్ 13 ఏళ్ల వయసులోనే అతని తండ్రి ముత్యాలు తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ లో పని చేస్తున్న ఆయన తనకు జోధ్‌పూర్ ట్రాన్స్‌ఫర్ కావడంతో కొడుకు కెరీర్ కోసం ఆ ఉద్యోగం వదిలేశాడు. తర్వాత సొంతంగా బిజినెస్ మొదలు పెట్టినా నష్టపోవడంతో అందరూ ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతూ హేళన చేసి మాట్లాడినట్లు తాజాగా క్రికిన్ఫో ఇంటర్వ్యూలో నితీష్ వెల్లడించాడు.
"పేరు ప్రతిష్టలు చాలా వింతైనవి. నాకోసం తన కెరీర్ వదులుకున్న మా నాన్నను గతంలో తిట్టిన వాళ్లే ఐపీఎల్ తర్వాత ఆయన ముందు చూపు చూసి పొగుడుతున్నారు. నా ఇండియా కిట్ వచ్చినప్పుడు వాళ్లు ఎమోషనల్ కావడం నాకు గుర్తుంది. ఉద్యోగం వదిలి అందులో వచ్చిన డబ్బును వైజాగ్ లో ఉ మైక్రోఫైనాన్స్ వ్యాపారంలో పెట్టారు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన వ్యాపారం సరిగా సాగనప్పుడు మా బంధువులు, సమాజం, అందరూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు" అని నితీష్ చెప్పాడు.
అప్పటి వరకూ తాను కూడా ఏదో సరదాగా క్రికెట్ ఆడినా తర్వాత సీరియస్ గా తీసుకున్నట్లు నితీష్ రెడ్డి చెప్పాడు. "ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు, వదిలేసిన తర్వాత ఆయనతో ఎవరు ఎలా వ్యవహరించారో నేను చూశాను. ఆయను అవమానించారు. అసలు పట్టించుకోలేదు. అది చూసి తట్టుకోలేకపోయాను. అదే నన్న మోటివేట్ చేసింది. నాకోసం మా నాన్న అన్నీ వదులుకున్నాడు. అప్పటి వరకు నేను సరదా కోసం ఆడినా.. తర్వాత మొత్తం మారిపోయింది" అని నితీష్ చెప్పాడు.
అండర్ 16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో పరుగుల వర్షం కురిపించిన తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన తాను ఆ తర్వాత ఎలా దారి తప్పానో, అండర్ 19 క్రికెట్ లో వైఫల్యం తనను మళ్లీ ఎలా నేలకు దించిందో కూడా చెప్పాడు. ఈసారి ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు నెట్స్ లో తాను పేస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడం చూసి ప్యాట్ కమిన్స్ తనకు అవకాశం ఇచ్చాడని కూడా ఇదే ఇంటర్వ్యూలో నితీష్ తెలిపాడు.