Akram on Kohli: నన్ను తిట్టుకుంటారని తెలుసు కానీ బాబర్ కంటే కోహ్లి బెటర్ బ్యాటర్: వసీం అక్రమ్
Akram on Kohli: నన్ను తిట్టుకుంటారని తెలుసు కానీ బాబర్ కంటే కోహ్లి బెటర్ బ్యాటర్ అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు. బాబర్ మంచి బ్యాటర్లలో ఒకడైనా కూడా అతడు కోహ్లి స్థాయికి ఎదగడానికి టైమ్ పడుతుందని చెప్పాడు.
Akram on Kohli: ఆసియా కప్ 2023లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ శనివారం (సెప్టెంబర్ 2) జరగబోతోంది. ఈ మ్యాచ్ గురించి సాధారణ క్రికెట్ అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు, క్రికెట్ పండితులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కు ముందు పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
సాధారణంగా ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటేనే కోహ్లి, బాబర్ మధ్య పోటీగా భావిస్తారు. ఈ ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో అని ఆసక్తిగా చూస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో కోహ్లి ఒకడు. క్రమంగా అతని స్థాయికి ఎదుగుతున్నాడు బాబర్ ఆజం. పాకిస్థానీ అభిమానులు బాబర్ ను తరచూ కోహ్లితో పోలుస్తూ అతని కంటే బెటర్ బ్యాటర్ అని అంటుంటారు.
కానీ వసీం అక్రమ్ మాత్రం బాబర్ కంటే కోహ్లియే మెరుగైన బ్యాటర్ అని స్పష్టం చేశాడు. ఈ మాట అంటే తన స్వదేశంలో తిట్టుకుంటారని తెలిసినా.. ఇదే నిజమని అతడు అనడం విశేషం. "ఇది చాలా కఠినమైన నిర్ణయం. అందుకే నేను సెలక్టర్ అవను.
నా దేశంలో నన్ను తిట్టుకుంటారని తెలుసు కానీ బాబర్ ఆజం కంటే విరాట్ కోహ్లియే బెటర్ బ్యాటర్. బాబర్ క్రమంగా అలా ఎదుగుతున్నాడు. అందులో సందేహం లేదు. ఆధునిక క్రికెట్ లోని గ్రేట్స్ లో ఒకడు. కానీ దానికి కొంత సమయం పడుతుంది. కోహ్లిని అందుకుంటాడు కానీ టైమ్ పడుతుంది" అని ఫాక్స్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ అక్రమ్ అన్నాడు.
ఇక ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ లోని ప్రధాన పేస్ బౌలర్లు బుమ్రా, షహీన్ అఫ్రిదిలపై కూడా అక్రమ్ స్పందించాడు. ఈ ఇద్దరిలో షహీన్ అఫ్రిదికే అక్రమ్ తన ఓటు వేశాడు. "బుమ్రా కంటే షహీన్ షా అఫ్రిది బెటర్. ఓ లెఫ్టామ్ పేసర్ గా అతడు స్టార్క్ ను గుర్తు చేస్తాడు. ఇద్దరూ మొదట్లోనే ఫుల్ లెంగ్త్ డెలివరీలతో వికెట్ల కోసం చూస్తారు.
అదే అతనిలో నాకు నచ్చుతుంది. గాయాలు కాకుంటే అఫ్రిది ముందు చాలా సుదీర్ఘ కెరీర్ ఉంది. 9, 10 స్థానాల్లో వచ్చి బ్యాటింగ్ కూడా మెరుగుపరచుకున్నాడు. సిక్స్ లు కూడా బాదగలడు. అసలు సిసలు వికెట్లు తీసే బౌలర్. టీమ్ లో చాలా ముఖ్యమైన ప్లేయర్" అని అక్రమ్ అన్నాడు.