ఇంగ్లండ్ పై సంచలన విజయంతో సెమీస్ రేసులో నిలిచిన అఫ్గానిస్థాన్.. ఆస్ట్రేలియాపై బ్యాటింగ్ లో పోరాడింది. కంగారూ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డా.. చివరకు మెరుగైన స్కోరే చేసింది. సెదికుల్లా అటల్ (85), అజ్మతుల్లా ఒమర్జాయ్ (67) పోరాటంతో అఫ్గాన్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.
స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా రెండేసి.. డ్వార్షియస్ మూడు వికెట్లు పడగొట్టారు. ఈ టార్గెట్ ను ఛేజ్ చేస్తే ఆస్ట్రేలియా ఛాంపియన్ ట్రోఫీ సెమీస్ చేరుతుంది.
ఆస్ట్రేలియాతో ఛాంపియన్స్ ట్రోఫీ పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన అఫ్గాన్ కు ఫస్ట్ ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (0)ను పేసర్ స్పెన్సర్ జాన్సన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లండ్ పై సంచలన సెంచరీ చేసిన ఇబ్రహీం జద్రాన్ (22), సెదికుల్లా కలిసి ఆ షాక్ నుంచి అఫ్గాన్ ను బయటపడేసే ప్రయత్నం చేశారు. ఈ జోడీ రెండో వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది.
జద్రాన్-సెదికుల్లా భాగస్వామ్యంతో సాఫీగా సాగుతున్న అఫ్గాన్ ఇన్నింగ్స్ కు ఒక్కసారిగా బ్రేక్ పడింది. జంపా స్పిన్ కు జద్రాన్ దాసోహమన్నాడు. రహ్మత్ షా (12)ను మ్యాక్స్ వెల్ బుట్టలో వేసుకున్నాడు. ఆ దశలో కెప్టెన్ షాహిది (20) జతగా సెదికుల్లా పోరాటం కొనసాగించాడు. ఆసీస్ బౌలర్లకు గొప్పగా ఎదుర్కొంటూ షాట్లు కొట్టాడు. సెంచరీ దిశగా సాగిపోయాడు. కానీ కంగారూ బౌలర్లు మరోసారి బంతితో సత్తాచాటారు. స్వల్ప వ్యవధిలో సెదికుల్లా, షాహిది, మహమ్మద్ నబి (1) పెవిలియన్ చేరారు.
కష్టాల్లో ఉన్న అఫ్గానిస్థాన్ మరింత ఇబ్బందుల్లోకి నెడుతూ సీనియర్ ఆటగాడు నబి సిల్లీగా రనౌటయ్యాడు. స్పెన్సర్ వేసిన బంతి లెగ్ సైడ్ బౌన్సర్ గా వెళ్లింది. వికెట్ కీపర్ ఇంగ్లిస్ మొదట దాన్ని అందుకోవడంలో తడబడ్డాడు. దీంతో నబి పరుగు కోసం క్రీజు దాటి వచ్చాడు. ఈ లోపు స్పెన్సర్ వికెట్ల దగ్గరకు పరుగెత్తాడు. ఇంగ్లిస్ నుంచి త్రో అందుకుని స్టంప్స్ ను లేపేసే సమయానికి నబి బ్యాట్ క్రీజు బయటే ఉంది.
199/7 స్కోరుతో కష్టాల్లో పడ్డ అఫ్గానిస్థాన్ ను అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆదుకున్నాడు. పోరాట పటమితో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. ఫైటింగ్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. రషీద్ ఖాన్ (19), నూర్ అహ్మద్ (6)తో కలిసి అఫ్గాన్ స్కోరును 270 దాటించాడు. ఆఖరి ఓవర్లో అజ్మతుల్లా ఔటయ్యాడు.
సంబంధిత కథనం