Rashid khan: మూడున్నరేళ్లలో 1000 వికెట్లు.. టీ20ల్లో అదే టార్గెట్.. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్
Rashid khan: టీ20ల్లో 1000 వికెట్లు పడగొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నానని అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చెప్పాడు. మరో మూడున్నరేళ్లలో ఆ లక్ష్యాన్ని చేరుకుంటాననే కాన్ఫిడెంట్ గా చెప్పాడు.

రికార్డుల రషీద్
అంతర్జాతీయ, దేశవాళీ,లీగ్ లు కలిపి టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా చరిత్ర నమోదు చేసిన రషీద్ ఖాన్ భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో (631) రికార్డును రషీద్ (633) అధిగమించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని ఎస్ఏ20 లీగ్ లో ఎంఐ కేప్ టౌన్ కు ఆడుతున్న రషీద్.. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ తో ఫైనల్ కు ముందు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడాడు.
1000 వికెట్ల లక్ష్యం
‘‘టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలవడం ఎంతో సంతృప్తినిస్తోంది. 15-20 ఏళ్లు ఆడితే ఈ రికార్డు బద్దలవుతుందేమో అనుకున్నా. కానీ కేవలం తొమ్మిదేళ్ల కెరీర్ లోనే ఇది సాధించా. ఇన్ని అంతర్జాతీయ టీ20లు, లీగ్ లు ఆడతానని అనుకోలేదు. ఇక 1000 వికెట్లే టార్గెట్. ఫిట్ గా ఉంటే వచ్చే మూడున్నరేళ్లలో దాన్ని అందుకుంటా’’ అని రషీద్ క్రిక్ఇన్ఫోతో చెప్పాడు.
బ్రావో అభినందనలు
టీ20ల్లో అత్యధిక వికెట్ల రికార్డు సాధించాక బ్రావోతో మాట్లాడానని రషీద్ వెల్లడించాడు. ‘‘అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ నా రికార్డు అధిగమించినందుకు సంతోషంగా ఉంది. ఈ రికార్డును బద్దలు కొట్టింది నువ్వే. వీటన్నిటికీ నువ్వు పూర్తిగా అర్హుడివి’’ అని బ్రావో తనతో చెప్పాడని రషీద్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ లో ఆ స్పెల్
గతేడాది టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ పై సాధించిన 4/23 తన కెరీర్ లోనే అత్యుత్తమ స్పెల్ అని రషీద్ చెప్పాడు. ఐపీఎల్ 2018 క్వాలిఫయర్-2లో కేకేఆర్ తో మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ తరపున తన ప్రదర్శన (3/19) కూడా మర్చిపోలేనన్నాడు. బిగ్ బాష్ లీగ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున 17 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడమూ ప్రత్యేకమేనన్నాడు.