Afghanistan Controversy: ఆసియా కప్ 2023లో ఆఫ్ఘనిస్థాన్ నెట్ రన్ రేట్ వివాదం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) దగ్గరికి చేరింది. శ్రీలంకతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో నెట్ రన్ రేట్ లెక్కలు తెలియక ఆఫ్ఘన్ టీమ్ సూపర్ 4 బెర్త్ దూరం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనికి బాధ్యులెవరో తేల్చాలంటూ ఏసీసీకి ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ఫిర్యాదు చేసింది.
ఆ మ్యాచ్ లో తమకు ఎవరూ నెట్ రన్ రేట్ కు సంబంధించి స్పష్టమైన లెక్కలు చెప్పలేదని ఆఫ్ఘనిస్థాన్ టీమ్ కోచ్ జొనాథన్ ట్రాట్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ లెక్కలు తెలియకే తాము ఓడిపోయామని, సూపర్ 4 బెర్త్ కు దూరమయ్యామని ట్రాట్ అన్నాడు. దీంతో ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదని ఆఫ్ఘన్ బోర్డు నిర్ణయించింది. నెట్ రన్ రేట్ లెక్కలను తమకు సరిగా చెప్పలేకపోవడం ఎవరి తప్పిదమో విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 291 రన్స్ చేసింది. శ్రీలంకను వెనక్కి నెట్టి ఆఫ్ఘనిస్థాన్ సూపర్ 4 చేరాలంటే ఆ టీమ్ 37.1 ఓవర్లలో ఆ టార్గెట్ చేజ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే సరిగ్గా ఆ 37వ ఓవర్ తొలి బంతికి ఆఫ్ఘన్ టీమ్ తమ 9వ వికెట్ కోల్పోయింది. దీంతో క్రీజులోకి వచ్చిన చివరి బ్యాటర్ రెండు బంతులు డిఫెన్స్ ఆడి మూడో బంతికి ఔటవడంతో శ్రీలంక 2 పరుగులతో గెలిచి సూపర్ 4 చేరింది.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆఫ్ఘన్ టీమ్ 37.1 ఓవర్లలో 292 రన్స్ చేసిన గెలవలేకపోయినా మరో అవకాశం వాళ్లకు ఉండింది. అదెలాగంటే ఆ టీమ్ 37.2 ఓవర్లలో 293, 37.3 ఓవర్లలో 294, 37.5 ఓవర్లలో 295, 38 ఓవర్లలో 296, 38.1 ఓవర్లలో 297 రన్స్ చేసినా సూపర్ 4కు అర్హత సాధించేది. ఆ విషయం టీమ్ లో ఎవరికీ తెలియలేదు.
దీంతో క్రీజులోకి వచ్చిన చివరి బ్యాటర్ ఫరూఖీ.. ఎలాగూ సూపర్ 4 అవకాశం చేజారింది కదా.. కనీసం మ్యాచ్ అయినా గెలిపిద్దాం అనుకొని ఆ ఓవర్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుదామన్నట్లు కనిపించాడు. కానీ మూడో బంతికే అతడు ఔటయ్యాడు.
ఒకవేళ ఈ లెక్కలు తమకు తెలిసి ఉంటే.. ఫరకూ ఎలాగోలా సింగిల్ తీసి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న రషీద్ ఖాన్ కు స్ట్రైక్ ఇస్తే.. ఊపు మీద ఉన్న అతడు మ్యాచ్ గెలిపించడంతోపాటు సూపర్ 4కు అర్హత సాధించేలా చేసేవాడన్నది ఆఫ్ఘనిస్థాన్ టీమ్ వాదన. ఇప్పుడు దీనిపైనే విచారణ జరపాలని ఆ టీమ్ డిమాండ్ చేస్తోంది.