ఇదేం బ్యాటింగ్ గురూ.. మన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఏమైంది? ఆ దూకుడు ఎందుకు కనిపించడం లేదు?.. ఇలా ఎన్నో ప్రశ్నలు. వాటన్నింటికీ సన్ రైజర్స్ గట్టి సమాధానం చెప్పింది. వరుస వైఫల్యాలను దాటి అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్సర్లు) రికార్డు సెంచరీతో చెలరేగిన వేళ ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు సాధించిన ఇండియన్ బ్యాటర్ గా అభిషేక్ నిలిచాడు.
అభిషేక్ విధ్వంసకర సెంచరీతో శనివారం (ఏప్రిల్ 12) పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 246 రన్స్ టార్గెట్ ను 9 బంతులు ఉండగానే ఛేదించింది. ఐపీఎల్ 2025లో వరుసగా అయిదు ఓటముల తర్వాత సన్ రైజర్స్ కు ఇదే తొలి గెలుపు. ఆరు మ్యాచ్ ల్లో రెండో విక్టరీ.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అంటే ఇలాగే చెలరేగాలి కదా. గత మ్యాచ్ ల్లో క్రీజులో నిలబడలేక, మంచి ఆరంభాలను ఇవ్వలేక పెవిలియన్ చేరిపోయిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 66; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఈ సారి చెలరేగిపోయారు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ను చిత్తుచిత్తు చేశారు. అర్ష్ దీప్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే రెండు ఫోర్లతో బాదుడు మొదలైంది.
అసలే భారీ టార్గెట్. అందుకే ఫస్ట్ నుంచే దంచుడు మొదలెట్టిన అభిషేక్, హెడ్ ఏ దశలోనూ ఆగలేదు. యాన్సెన్ ఓవర్లో అభిషేక్ నాలుగు ఫోర్లు బాదాడు. అర్ష్ దీప్ ఓవర్లో హెడ్ హ్యాట్రిక్ ఫోర్లు రాబట్టాడు. ఆ వెంటనే యశ్ ఠాకూర్ ను బలి చేస్తూ అభిషేక్ 4, 6, 6 కొట్టాడు. హెడ్ ఫోర్ కొడితే, అభిషేక్ సిక్సర్.. అభిషేక్ బంతిని స్టాండ్స్ లో పడేస్తే, హెడ్ బౌండరీ దాటించడం.. ఇలా ఈ ఇద్దరి విధ్వంసం సాగింది.
పవర్ ప్లేలోనే టీమ్ 83/0తో నిలిచింది. 19 బాల్స్ లోనే అభిషేక్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అభిషేక్, హెడ్ వీర బాదుడుతో సన్ రైజర్స్ స్కోరు 8 ఓవర్లలోనే 100 దాటింది. తోటి ఆసీస్ క్రికెటర్ మ్యాక్స్ వెల్ ఓవర్లో హెడ్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. 10 ఓవర్లకు 143 స్కోరు తో సన్ రైజర్స్ గెలుపు దిశగా దూసుకెళ్లింది.
హాఫ్ సెంచరీ తర్వాత హెడ్ ఔట్ అయ్యాడు. ఈ ఓపెనింగ్ జోడీ 12.2 ఓవర్లలోనే 171 రన్స్ రాబట్టింది. ఆ వెంటనే అభిషేక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 బాల్స్ లోనే హండ్రెడ్ బాదాడు. ఆ వెంటనే తన దగ్గరున్న పేపర్ ను బయటకు తీసి చూపించాడు. దీనిపై ‘ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం’ అని రాసి ఉంది.
సెంచరీ తర్వాత కూడా అభిషేక్ ఆగలేదు. మరింతగా రెచ్చిపోయాడు. విశ్వరూపం చూపించాడు. చాహల్ బౌలింగ్ లో వరుసగా 6, 4, 6 బాదిన అతను.. యశ్ ఠాకూర్ ఓవర్లో వరుసగా 6, 4 సాధించాడు. 15 ఓవర్లోనే సన్ రైజర్స్ స్కోరు 200 దాటింది. అభిషేక్ అద్బుత ఇన్నింగ్స్ కు అర్ష్ దీప్ ఎండ్ కార్డు వేసినా.. క్లాసెన్ (21 నాటౌట్), ఇషాన్ కిషన్ (9 నాటౌట్) కలిసి మ్యాచ్ ముగించారు. ఐపీఎల్ హిస్టరీలో ఇది సెకండ్ హైయ్యస్ట్ ఛేజ్.
అంతకుముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 82; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 42; 7 ఫోర్లు, ఓ సిక్సర్) కూడా సత్తాచాటాడు.
హర్షల్ పటేల్ (4/42) నాలుగు వికెట్లతో సత్తాచాటి లాస్ట్ లో పంజాబ్ కింగ్స్ ను కట్టడి చేసేలా కనిపించాడు. కానీ షమి వేసిన ఆఖరి ఓవర్లో లాస్ట్ 4 బంతుల్లో స్టాయినిస్ (11 బంతుల్లో 34 నాటౌట్) వరుసగా 4 సిక్సర్లు కొట్టాడు.
సంబంధిత కథనం