Abhishek Sharma: రికార్డు సెంచరీతో టీ20 ర్యాంకుల్లో దూసుకెళ్లిన అభిషేక్ శర్మ.. 38 స్థానాలు ఎగబాకి.. వరుణ్ కూడా-abhishek sharma varun chakravarthy gain in latest icc t20i rankings ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Abhishek Sharma: రికార్డు సెంచరీతో టీ20 ర్యాంకుల్లో దూసుకెళ్లిన అభిషేక్ శర్మ.. 38 స్థానాలు ఎగబాకి.. వరుణ్ కూడా

Abhishek Sharma: రికార్డు సెంచరీతో టీ20 ర్యాంకుల్లో దూసుకెళ్లిన అభిషేక్ శర్మ.. 38 స్థానాలు ఎగబాకి.. వరుణ్ కూడా

Hari Prasad S HT Telugu
Feb 05, 2025 03:24 PM IST

Abhishek Sharma: ఇంగ్లండ్ పై చివరి టీ20లో మెరుపు సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వరుణ్ చక్రవర్తి లేటెస్ట్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో పైకి ఎగబాకారు. అభిషేక్ అయితే ఏకంగా 38 స్థానాలు ఎగబాకడం విశేషం.

రికార్డు సెంచరీతో టీ20 ర్యాంకుల్లో దూసుకెళ్లిన అభిషేక్ శర్మ.. 38 స్థానాలు ఎగబాకి.. వరుణ్ కూడా
రికార్డు సెంచరీతో టీ20 ర్యాంకుల్లో దూసుకెళ్లిన అభిషేక్ శర్మ.. 38 స్థానాలు ఎగబాకి.. వరుణ్ కూడా (AFP)

Abhishek Sharma: టీమిండియా యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి టీ20 ర్యాంకుల్లో దూసుకెళ్లారు. ఇంగ్లండ్ తో చివరి టీ20లో రికార్డు సెంచరీ బాదిన అభిషేక్.. ఏకంగా 38 స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్ కు చేరుకోవడం విశేషం. బుధవారం (ఫిబ్రవరి 5) ఐసీసీ లేటెస్ట్ టీ20 ర్యాంకులను రిలీజ్ చేసింది. అటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరో మూడు స్థానాలు ఎగబాకాడు.

yearly horoscope entry point

అభిషేక్.. ర్యాంకుల్లోనూ ధనాధన్

టీమిండియా టీ20 జట్టులోకి వచ్చినప్పటి నుంచీ అభిషేక్ శర్మ చెలరేగుతున్న విషయం తెలుసు కదా. ధనాధన్ ఇన్నింగ్స్ తో అతడు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. దీంతో తాజా టీ20 ర్యాంకుల్లో అతడు ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ముఖ్యంగా చివరి టీ20లో మెరుపు వేగంతో 135 రన్స్ చేసిన అతడు.. 38 స్థానాలు పైకి ఎగబాకాడు.

కేవలం 54 బంతుల్లోనే 135 రన్స్ చేసిన అతడు.. టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఐదు టీ20ల సిరీస్ లో అభిషేక్ 279 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అతని సగటు 55.80 కాగా.. స్ట్రైక్ రేట్ 219.68గా ఉంది. ఒక సెంచరీ, మరో హాఫ్ సెంచరీ చేశాడు.

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ టీ20ల్లో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే అభిషేక్ ప్రస్తుతం కేవలం 26 రేటింగ్ పాయింట్స్ దూరంలోనే ఉన్నాడు. మూడో స్థానంలో తిలక్ వర్మ, ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. అటు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె కూడా టీ20 ర్యాంకుల్లో మెరుగయ్యారు.

బౌలర్లలో వరుణ్ చక్రవర్తి జోరు

అటు బౌలర్లలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్, టీ20 సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయిన వరుణ్ చక్రవర్తి మూడు స్థానాలు పైకి ఎగబాకి రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. టీ20 ర్యాంకుల్లో వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హొస్సేన్ తన నంబర్ స్థానాన్ని తిరిగి అందుకున్నాడు.

అంతకుముందు వారం ఆదిల్ రషీద్ కు ఈ స్థానం దక్కగా మరోసారి.. ర్యాంకుల్లో మార్పులు జరిగాయి. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో రాణించిన వరుణ్ చక్రవర్తిని ఇప్పుడు వన్డే టీమ్ లోకి కూడా తీసుకున్న విషయం తెలిసిందే. అతన్ని ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. మరి తొలిసారి వన్డేలు ఆడబోతున్న వరుణ్.. ఏమాత్రం ప్రభావం చూపుతాడో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం