Abhishek Sharma: ఐపీఎల్ సీజన్‍కు ముందు సన్‍రైజర్స్ ఓపెనర్స్ భీకర ఫామ్.. ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో టాప్-2లో ఇద్దరు-abhishek sharma massive boost in icc t20i rankings varun chakravarthy also gains after india vs england t20 series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Abhishek Sharma: ఐపీఎల్ సీజన్‍కు ముందు సన్‍రైజర్స్ ఓపెనర్స్ భీకర ఫామ్.. ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో టాప్-2లో ఇద్దరు

Abhishek Sharma: ఐపీఎల్ సీజన్‍కు ముందు సన్‍రైజర్స్ ఓపెనర్స్ భీకర ఫామ్.. ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో టాప్-2లో ఇద్దరు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 05, 2025 03:38 PM IST

Abhishek Sharma: ఐసీసీ టీ20 ర్యాంకింగ్‍ల్లో అభిషేక్ శర్మ రాకెట్ వేగంతో దూసుకొచ్చేశాడు. ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ భారత సంచలనం ర్యాంకింగ్‍ల్లో సత్తాచాటాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా మరింత పైకి వచ్చేశాడు.

Abhishek Sharma: 40 నుంచి 2.. ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో రాకెట్‍లా దూసుకొచ్చిన అభిషేక్ శర్మ.. వరుణ్ చక్రవర్తి కూడా..
Abhishek Sharma: 40 నుంచి 2.. ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో రాకెట్‍లా దూసుకొచ్చిన అభిషేక్ శర్మ.. వరుణ్ చక్రవర్తి కూడా.. (Surjeet Yadav)

భారత యంగ్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20ల్లో ఓ రేంజ్ ఫామ్‍లో ఉన్నాడు. చెలరేగి ఆడుతున్నాడు. గతేడాది ఐపీఎల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ తరఫున దుమ్మురేపి టీమిండియాలోకి వచ్చిన ఈ యువ సంచలనం అదే మరింత ధనాధన్ హిట్టింగ్‍తో రెచ్చిపోతున్నాడు. ఇంగ్లండ్‍తో ఇటీవల టీ20 సిరీస్‍లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిరీస్‍లో చివరిదైన ఐదో టీ20లో అభిషేక్.. ఇంగ్లండ్ బౌలర్లను అభిషేక్ వీరబాదుడు బాదేశాడు. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులు చేసి విశ్వరూపం చూపించాడు. దీంతో ఐసీసీ తాజా టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో అభిషేక్ ఏకంగా 40 నుంచి 2వ ర్యాంకుకు రాకెట్‍లా దూసుకొచ్చాడు. ట్రావిస్ హెడ్ టాప్ ప్లేస్‍లో ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‍కు ముందు ఈ ఇద్దరి ఫామ్ సన్‍రైజర్స్ హైదరాబాద్‍లో జోష్ నింపుతోంది.

టాప్-2లో సన్‍రైజర్స్ ఓపెనర్స్

ఐసీసీ నేడు (ఫిబ్రవరి 5) తాజాగా టీ20 క్రికెట్ ర్యాంకింగ్స్ వెల్లడించింది. టీ20 బ్యాటర్ల విభాగంలో అభిషేక్ శర్మ రెండో ర్యాంకుకు దూసుకొచ్చేశాడు. గత ర్యాంకింగ్‍ల్లో 40వ స్థానంలో ఉన్న అభిషేక్ ఏకంగా 38 ర్యాంకులు ఎగబాకాడు. 829 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంకుకు శరవేగంగా వచ్చేశాడు. మొదటి ర్యాంకులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు)కు కేవలం 26 పాయింట్లలో దూరంలోకి వచ్చేశాడు. ఐపీఎల్‍లో ఈ ఇద్దరూ సన్‍రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లే.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వచ్చే నెలలోనే మొదలుకానుండగా.. అభిషేక్, హెడ్ చెలరేగి ఆడుతుండటం హైదరాబాద్ ఫ్రాంచైజీలో మరింత జోష్ ఉండనుంది. గతేడాది ఈ ఇద్దరూ భీకర హిట్టింగ్‍తో చెలరేగారు. జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించారు. ఈసారి వారు అంతే భీకర ఫామ్‍లో ఉన్నారు. దీంతో ఐపీఎల్‍లో ప్రత్యర్థి జట్లు మరోసారి వణికిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అభిషేక్ హిట్టింగ్ పవర్ మరింత పెరిగిపోయింది. హైదరాబాద్ టీమ్‍కు ఇది చాలా గుడ్‍న్యూస్‍గా ఉంది.

మరింత భీకరంగా బ్యాటింగ్ లైనప్

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్‍కు తోడు ఐపీఎల్ 2025 సీజన్ కోసం హైదరాబాద్ జట్టులోకి ఇషాన్ కిషన్ వచ్చేశాడు. తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా మంచి ఫామ్‍లో ఉన్నాడు. మొత్తంగా ఈ సీజన్‍లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ బ్యాటింగ్ దళం మరింత బలంగా ఉంది. గతేడాదే హిట్టింగ్‍తో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించింది సన్‍రైజర్స్. ఈసారి బ్యాటింగ్ మరింత బలోపేతం కావడం, ఆటగాళ్లు మంచి ఫామ్‍లో ఉండటంతో ఏ రేంజ్‍లో చెలరేగుతారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కమిన్స్, మహమ్మద్ షమీ, ఉనాద్కత్, ఆజం జంపాతో బౌలింగ్‍లోనూ ఈసారి పటిష్టంగా ఉంది హైదరాబాద్.

Whats_app_banner

సంబంధిత కథనం