Abhishek Sharma: కొడితే గ్రౌండ్ అవతల పడింది.. అభిషేక్ దెబ్బకు కనిపించకుండా పోయిన బాల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ సిక్స్ కొడితే బంతి ఏకంగా గ్రౌండ్ అవతల కనిపించకుండా పోయింది. జోహన్నెస్‌బర్గ్ లోని వాండరర్స్ లో సౌతాఫ్రికాతో నాలుగో టీ20లో టీమిండియా ఓపెనర్ దెబ్బ అదిరిపోయింది.
Abhishek Sharma: సౌతాఫ్రికాతో నాలుగో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి చెలరేగిపోయాడు. అయితే అతడు కొట్టిన ఓ సిక్స్ జోహన్నెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియం బయట పడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ బంతి చివరికి కనిపించకుండా పోయింది.
అభిషేక్ శర్మ భారీ సిక్స్
సౌతాఫ్రికా బౌలర్లతో మరోసారి టీమిండియా బ్యాటర్లు ఆటాడుకున్న వేళ.. ఓపెనర్ అభిషేక్ శర్మ వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్ లో 18 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 36 రన్స్ చేశాడు. అయితే ఆ నాలుగు సిక్స్ లలో ఒకటి ఏకంగా గ్రౌండ్ బయట పడింది. ఐదో ఓవర్ తొలి బంతికి అతడీ సిక్స్ కొట్టాడు.
రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ లో ముందుకు దూసుకొచ్చిన అభిషేక్.. ఎక్స్‌ట్రా కవర్ మీదుగా ఈ సిక్స్ బాదాడు. అతడు ఎంత బలంగా కొట్టాడంటే.. ఆ బాదుడికి బంతికి స్టేడియం బయట పడింది. రీప్లేల్లో బంతి స్టేడియం పక్కనే ఉన్న ఇంటి దగ్గర పడినట్లు తేలింది.
డకౌట్ కావాల్సినవాడు..
నిజానికి ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ డకౌటయ్యేవాడే. ఇన్నింగ్స్ మొదట్లోనే యాన్సెన్ బౌలింగ్ లో స్లిప్ ఫీల్డర్ రీజా హెండ్రిక్స్ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అభిషేక్ శర్మ.. తర్వాత చెలరేగిపోయాడు. వరుస సిక్స్ లు బాదాడు. మొదట్లో 7 బంతుల్లో కేవలం 2 పరుగులే చేసిన అతడు.. తర్వాతి 11 బంతుల్లో ఏకంగా 34 రన్స్ చేయడం విశేషం.
మూడో ఓవర్లో యాన్సెన్ బౌలింగ్ లో తొలి సిక్స్ కొట్టిన తర్వాత వెనుదిరిగి చూడలేదు. సిమిలానె బౌలింగ్ లో మూడు సిక్స్ లు కొట్టడంతో ఇండియా ఇక చెలరేగిపోయింది. కేవలం 4.1 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ అందుకుంది. అయితే అభిషేక్ కొట్టిన ఆ సిక్స్ మాత్రం మ్యాచ్ కే హైలైట్ అని చెప్పొచ్చు.