Abdul Razzaq: ఐశ్వర్య రాయ్‌పై నోరు పారేసుకున్న పాక్ మాజీ క్రికెటర్.. ఆమెతో పిల్లలను కంటే అంటూ..
Abdul Razzaq: ఐశ్వర్య రాయ్‌పై నోరు పారేసుకున్నాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ టీమ్ ప్రదర్శనపై మాట్లాడుతూ.. అర్థంపర్థం లేకుండా మధ్యలో ఐశ్వర్య పేరును ప్రస్తావించాడు.

Abdul Razzaq: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ పై నోరు పారేసుకున్నాడు. పాకిస్థాన్ టీమ్ వరల్డ్ కప్ సెమీస్ కూడా చేరకుండా ఇంటిదారి పట్టడంతో ఆ జట్టు మాజీలు విమర్శలు వర్షం గుప్పిస్తున్నారు. ఇలాగే ఓ ఓపెన్ డిబేట్ లో మాజీ క్రికెటర్లు ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిదిలతో కలిసి రజాక్ మాట్లాడాడు.
అయితే ఈ సందర్భంగా రజాక్ చేసిన కామెంట్స్ భారత అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. అతడు అసలు అర్థంపర్థం లేకుండా ఐశ్వర్య రాయ్ పేరును ప్రస్తావించాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పాక్ టీమ్ వైఫల్యాల గురించి మాట్లాడుతూ రజాక్ ఐశ్యర్య పేరును ప్రస్తావించాడు. మంచి ప్లేయర్స్ ను డెవలప్ చేయడంలో విఫలమైన పీసీబీని రజాక్ విమర్శించాడు.
ఐశ్వర్యతో పిల్లలను కంటే..
అసలు మంచి ప్లేయర్స్ ను అభివృద్ధి చేయాలని, ఉన్న ప్లేయర్స్ ను పాలిష్ చేయాలన్న ఉద్దేశమే పీసీబీకి లేదంటూ రజాక్ విమర్శించాడు. ఈ సందర్భంగా ఓ చెత్త ఉదాహరణ ఇవ్వడం షాక్ కు గురి చేసింది. "ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకొని ఆమెతో పిల్లలను కన్నంత మాత్రాన ఆ పిల్లలు చాలా అందంగా ఉంటారనుకోకూడదు. అది ఎప్పటికీ జరగదు" అని రజాక్ అన్నాడు.
రజాక్ నోటి వెంటనే సడెన్ గా ఐశ్వర్య పేరు రావడంతో మొదట షాక్ తిన్న షాహిద్ అఫ్రిది.. తర్వాత నవ్వుతూ చప్పట్లు కొట్టడం గమనార్హం. రజాక్ తోపాటు గుల్, అఫ్రిదిల తీరుపై భారత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలా మాట్లాడటం సిగ్గు చేటని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. నువ్వు ఐశ్వర్య రాయ్ కారు డ్రైవర్ గా ఉండటానికి కూడా పనికి రావంటూ రజాక్ పై తిట్ల దండకం అందుకున్నారు.
వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ లీగ్ స్టేజ్ లోనే ఐదు మ్యాచ్ లో ఓడిపోయి సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు పాకిస్థాన్ మాజీలు పాక్ టీమ్, పాక్ క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్ బాబర్ ఆజంను తప్పించాలనీ డిమాండ్ చేస్తున్నారు.