18వ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి 22 నుంచి ఈ రీచ్ లీగ్ కొత్త సీజన్ సాగుతుంది. ఈ లీగ్ హిస్టరీలో ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ ముద్దాడలేకపోయింది. 17 సీజన్లలోనూ వట్టి చేతులతోనే తిరిగివెళ్లింది. కానీ ఆర్సీబీని వదిలి వేరే జట్లలో చేరిన కొంతమంది ఆటగాళ్లు మాత్రం ట్రోఫీని ముద్దాడారు. అలాంటి టాప్-5 ప్లేయర్స్ ఎవరో చూసేయండి.
2014లో 14 కోట్ల రూపాయలకు టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. కానీ ఆ సీజన్ తర్వాత జట్టు నుంచి రిలీజ్ అయ్యాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి తన తొలి ఐపీఎల్ ట్రోఫీని యువీ గెలుచుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ఫైనల్‌లో ఆర్సీబీపైనే సన్‌రైజర్స్ గెలిచింది. 2019లో ముంబై ఇండియన్స్ తరఫున రెండో ట్రోఫీని గెలుచుకున్నాడు. ఒక నెల తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
పార్థివ్ పటేల్ 2014లో ఆర్సీబీ జట్టులో భాగమయ్యాడు. కానీ ఆ జట్టు తరఫున విజేతగా నిలవలేకపోయాడు. ఆర్సీబీని వీడి ముంబయి ఇండియన్స్ లో చేరిన పార్థివ్ 2015, 2017లో ఛాంపియన్ గా నిలిచాడు. 2018 నుంచి 2020 వరకు మళ్లీ ఆర్సీబీకి ఆడినా లాభం లేకపోయింది. 2020లో మొత్తం బెంచ్‌కు పరిమితమయ్యాడు. ఈ సీజన్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.
జాక్ కలిస్ తన ఐపీఎల్ కెరీర్‌ను ఆర్సీబీతోనే ప్రారంభించాడు. మూడు సీజన్లు ఈ జట్టుకు ఆడాడు. 2009లో ఆర్సీబీ తరఫున ఫైనల్ కూడా ఆడాడు. కానీ డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. ఆ తర్వాత 2011లో కేకేఆర్ లో చేరిన కలిస్ నాలుగేళ్ల పాటు ఆ ఫ్రాంచైజీకి సేవలందించాడు. ఆర్సీబీని వీడిన రెండేళ్ల తర్వాత కేకేఆర్ తో తొలి కప్ ఖాతాలో వేసుకున్నాడు.
మొయిన్ అలీ 2018 మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్‌లో చేరాడు. మూడు సంవత్సరాలు రెడ్ ఆర్మీతో ఉన్న అలీ 2021లో సీఎస్కేకు వెళ్లిపోయాడు. ఆర్సీబీలో మూడేళ్లు ఉన్నా అలీకి నిరాశ తప్పలేదు. కానీ సీఎస్కేకు వెళ్లిన 2021లో అతను ఛాంపియన్ జట్టులో భాగమయ్యాడు. 2023లో సీఎస్కే తరఫున మరో టైటిల్ గెలుచుకున్నాడు.
రోబిన్ ఉత్తప్ప 2009, 2010లో ఆర్సీబీతో ఆడాడు. 2009లో ఫైనల్లోనూ బరిలో దిగాడు. అనంతరం 2011 నుంచి 2013 వరకు పూణే వారియర్స్ తరఫున ఆడిన ఉత్తప్ప ఆ తర్వాత కోల్‌కతాలో చేరాడు. ఆర్సీబీని వీడిన నాలుగు సంవత్సరాల తర్వాత కేకేఆర్ తరఫున తన మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాడు. 2021లో చెన్నైలో చేరిన ఉత్తప్ప రెండవ సారి ఛాంపియన్ అయ్యాడు.
షేన్ వాట్సన్, శివమ్ దూబే, మనీష్ పాండే, కేదార్ జాదవ్, క్వింటన్ డి కాక్‌తో సహా చాలా మంది ఆర్సీబీని వీడిన తర్వాత వేరే జట్ల తరఫున ఛాంపియన్ అయ్యారు. కానీ ఆర్సీబీ మాత్రం కప్ ఎత్తలేదు. ఈ సారి అయినా ట్రోఫీ గెలుస్తుందా అని చూడాలి.
సంబంధిత కథనం