Super Over: క్రికెట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ - ఒక్క మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్లు - ఇండియాలోనే ఈ రికార్డ్ నమోదు
Super Over: మహారాజా క్రికెట్ టోర్నీలో బెంగళూరు బ్లాస్టర్స్, హూబ్లీ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్లు నిర్వహించారు. మ్యాచ్‌తో పాటు ఆ తర్వాత జరిగిన రెండు సూపర్ ఓవర్లు టై అయ్యాయి. మూడో సూపర్ ఓవర్‌లో బెంగళూరు బ్లాస్టర్స్‌పై హూబ్లీ టైగర్స్ విజయాన్ని సాధించింది.
Super Over: మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్స్ నిర్వహించడం కామన్. దాదాపు ఫలితం ఫస్ట్ సూపర్ ఓవర్‌లోనే తేలుతుంది. రెండో సూపర్ ఓవర్ ఆడించడం అన్నది ఇప్పటివరకు ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో ఓ సారి...ఐపీఎల్‌లో మరోసారి మాత్రమే జరిగింది.
ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్ మ్యాచ్...
ఈ ఏడాది జనవరిలో ఇండియా, అఫ్గనిస్తాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ రిజల్ట్ రెండో సూపర్ ఓవర్‌లో వచ్చింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు సూపర్ ఓవర్లు ఆడించిన మొదటి..ఏకైక మ్యాచ్‌గా ఇండియా, అఫ్గనిస్తాన్ టీ20 రికార్డుల్లో నిలిచింది.
ఐపీఎల్2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్యజరిగిన మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్‌లో ఫలితం వచ్చింది. ఈ రెండు మినహా ఇంటర్నేషనల్, ఫస్ట్ క్లాస్‌తో పాటు లీగ్ మ్యాచుల్లో రెండు సూపర్లు ఓవర్లు ఎప్పుడు జరగలేదు.
మహారాజా క్రికెట్ టోర్నీలో...
కర్ణాటక వేదికగా జరుగుతోన్న మహారాజా టీ20 లీగ్‌లో ఏకంగా విన్నింగ్ కోసం ఏకంగా మూడు సూపర్ ఓవర్లు ఆడాల్సివచ్చింది. శుక్రవారం హూబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు నువ్వానేనా అన్నట్లుగా సాగింది. ఇందులో మూడో సూపర్ ఓవర్‌లో బెంగళూరు బ్లాస్టర్స్‌పై హూబ్లీ టైగర్స్ విజయాన్ని సాధించింది.
164 పరుగులు...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హూబ్లీ టైగర్స్ ఇరవై ఓవర్లలో 164 పరుగులు చేసింది. కెప్టెన్ మనీష్ పాండే ఇరవై రెండు బాల్స్‌లో మూడు సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. అనీశ్వర్ గౌతమ్ 30, మన్వంత్ కుమార్ 28 రన్స్ చేశారు.ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన బెంగళూరు బ్లాస్టర్స్ సరిగ్గా ఇరవై ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 34 బాల్స్‌లో తొమ్మిది ఫోర్లతో 54 పరుగులు చేశాడు.
మూడు సూపర్ ఓవర్లు...
మ్యాచ్ టై కావడంతో ఫస్ట్ సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. ఇందులో హూబ్లీ టైగర్స్ పది పరుగులు చేయగా.. బెంగళూరు బ్లాస్టర్స్ కూడా సూపర్ ఓవర్‌లో పది పరుగులే చేసింది. ఆ తర్వాత రెండో సూపర్ ఓవర్‌లో రెండు టీమ్‌లు తలో ఎనిమిది పరుగులు చేయడంతో మ్యాచ్ మూడో సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
హూబ్లీ టైగర్స్ విన్...
మూడో సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ ఓ వికెట్ నష్టపోయి 12 పరుగులు చేసింది. హూబ్లీ టైగర్స్ 13 పరుగులు చేసి మూడో సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. రెండు ఫోర్లతో మన్వంత్ కుమార్ హూబ్లీ టైగర్స్‌కు విజయాన్ని అందించాడు.
ఇదే ఫస్ట్ టైమ్...
ఒకే మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్లు నిర్వహించడం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. అరుదైన రికార్డుతో హూబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది.
టాపిక్