తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇవాళ (మే 13) రాష్ట్రవ్యాప్తంగా 276 కేంద్రాల్లో ఎగ్జామ్ పూర్తి కానుంది. ఈ ఏడాది 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత పొందిన వారు… పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతారు.
త్వరలోనే తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు విడుదలవుతాయి. అధికారుల ప్రకటించిన వివరాల ప్రకారం… పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. దీని ప్రకారం మే 13వ తేదీన పరీక్ష జరగగా… మే 24వ తేదీ తర్వాత రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు విడుదలైన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. ఇందులో 85 శాతం స్థానికులకు మిగిలిన 15 శాతం సీట్లను స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. 4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే లోకల్(స్థానికం)గా పరిగణిస్తారు. విడతల వారీగా సీట్ల భర్తీ ఉంటుంది. సీట్లు మిగిలే స్పాట్ అడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతాయి. పూర్తి వివరాలను సాంకేతిక విద్యా మండలి ప్రకటిస్తుంది.
గతేడాది చూస్తే మే 24న తెలంగాణ పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు హాజరుకాగా.. 84.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను జూన్ 3వ తేదీన వెల్లడించారు. ఈసారి మే 13వ తేదీన ఎగ్జామ్ నిర్వహించగా…మే 24వ తేదీ లేదా ఆలోపే ప్రకటించే అవకాశం ఉంటుంది.