ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్షల నిర్వహణకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వగా… దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈసారి మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. వీరిలో పేపర్-1కు 63,261 మంది, పేపర్-2కు 1,20,392 మంది అప్లయ్ చేశారు. వీరంతా కూడా టెట్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.
జూన్ 15 నుంచి తెలంగాణ టెట్ 2025 పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 30వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. పరీక్షల షెడ్యూల్ వివరాలను రేపోమాపో ప్రకటిస్తారు.
ఇక తెలంగాణ టెట్ పరీక్షల హాల్ టికెట్లు జూన్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
తెలంగాణ టెట్ పరీక్షలు ఈనెల 30వ తేదీతో పూర్తవుతాయి. వీటికి సంబంధించిన ప్రాథమిక కీలను వెల్లడిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అన్ని పరిశీలించిన తర్వాత…. జూలై 22వ తేదీన టెట్ తుది ఫలితాలను విడుదల చేస్తారు.
ఇక తెలంగాణలో టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్-1 సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకానికి, పేపర్-2 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. పేపర్-2లో గణితం, సైన్స్, సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కులకు ఉంటుంది. పేపర్-1కు 1-8 తరగతులు, పేపర్-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి.
అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.
టెట్ పరీక్షలో జనరల్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలాగైతేనే టెట్ లో అర్హత సాధించినట్లు అవుతారు. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది.