ఏపీ పాలిసెట్ - 2025 ఎంట్రెన్స్ ఎగ్జామ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫైనల్ కీ కూడా వచ్చేసింది. ఇక తుది ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితాలను మే మూడో వారంలో ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.
ఏపీ పాలిసెట్ - 2025 ఎగ్జామ్ ను ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించారు. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా పాలిటెక్నిక్ కళాశాలల్లోని వివిధ ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్లు కల్పిస్తారు.
ఈ ఏడాది పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు. ఇందుకు 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన వెంటనే ప్రాథమిక కీని విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించారు. ఇటీవలే ఫైనల్ కీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఫైనల్ కీ కూడా అందుబాటులోకి రావటంతో త్వరలోనే రిజల్ట్స్ ను విడుదల చేయనున్నారు. దీనిపై అధికారులు అప్డేట్ ఇచ్చారు. మే మూడో వారంలో రిజల్ట్స్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మార్కులతో పాటు ర్యాంక్ కార్డు కూడాను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఏపీ పాలిసెట్ - 2025 పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను https://apsbtet.ap.gov.in లేదా https://polycetap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ పొందవచ్చు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ ను 120 మార్కులకు నిర్వహించారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. వీటితో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది.
గతేడాది(2024) నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు మొత్తం 1.42లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 1.24లక్షల మంది అర్హత పొందారు. మొత్తం 87.61శాతం ఉత్తీర్ణత నమోదు కాగా…. బాలికలు 89.81శాతం (50,710), బాలురు 86.16 శాతం(73,720) ఉత్తీర్ణత సాధించారు.
సంబంధిత కథనం