దూరవిద్యలో సైకాలజీ రద్దు! యూజీసీ నిర్ణయానికి అసలు కారణం ఏంటి?-what is the reason behind ugc ban on distance psychology degrees ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  దూరవిద్యలో సైకాలజీ రద్దు! యూజీసీ నిర్ణయానికి అసలు కారణం ఏంటి?

దూరవిద్యలో సైకాలజీ రద్దు! యూజీసీ నిర్ణయానికి అసలు కారణం ఏంటి?

Sharath Chitturi HT Telugu

దూరవిద్యలో సైకాలజీ డిగ్రీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించి యూజీసీ షాక్​ ఇచ్చింది. ఈ కారణంగా 1.3లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి! యూజీసీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి?

యూజీసీ సంచలన నిర్ణయం!

దేశంలో మెంటల్​ హెల్త్​పై అవేర్​నెస్​ ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సైకాలజీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య సైతం ఊపందుకుంది. మరీ ముఖ్యంగా దూరవిద్య (డిస్టెన్స్​ లెర్నింగ్​) ద్వారా చదువుకోవాలనుకునే వారికి ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానం ఒక పెద్ద అవకాశాన్ని ఇచ్చింది. కానీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది! దూరవిద్యలో సైకాలజీ డిగ్రీలను పూర్తిగా రద్దు చేస్తూ యూజీసీ తీసుకున్న ఈ నిర్ణయం విద్యారంగంలో పెద్ద చర్చకు దారి తీసింది!

యూజీసీ నిర్ణయంతో 1.3లక్షల మందిపై ప్రభావం!

యూజీసీ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సుమారు 1.3 లక్షల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇందులో ఇప్పుడు అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ సైకాలజీ కోర్సుల్లో ఉన్న విద్యార్థులు, అలాగే ఇప్పటికే డిగ్రీలు పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు.

2025-26 అకాడమిక్ సెషన్ నుంచి యూనివర్సిటీలు డిస్టెన్స్ లేదా ఆన్‌లైన్ మోడ్‌లో సైకాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు ఇవ్వడానికి వీల్లేదు. అంతేకాకుండా గతంలో పొందిన డిగ్రీలు కూడా చెల్లుబాటు కోల్పోతాయి! దీనితో ఇప్పటికే సైకాలజీలో డిగ్రీ ఉన్నవారు కూడా తమ ఫ్యూచర్‌ స్టడీస్‌కు, కెరీర్‌కు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సడెన్‌ బ్యాన్‌తో యూనివర్సిటీలు, ఎడ్యుకేటర్లు, విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది.

ఈ నిర్ణయానికి కారణం ఏంటి?

దూరవిద్య సైకాలజీ కోర్సులను రద్దు చేయడానికి యూజీసీ ప్రధానంగా ఒక నియంత్రణ మార్పును కారణం చూపింది. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ చట్టం 2021 కింద ఏర్పడిన NCAHP పరిధిలోకి సైకాలజీ లాంటి కొన్ని విభాగాలను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో యూజీసీలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (డీఈబీ) గతంలో యూనివర్సిటీలకు ఇచ్చిన ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్​) మోడ్ పర్మిషన్స్‌ను విత్‌డ్రా చేసుకుంది.

యూజీసీ 592వ మీటింగ్‌లో ఈ వివాదాస్పద నిర్ణయాన్ని అధికారికం చేశారు. సైకాలజీతో పాటు మైక్రోబయాలజీ, న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ వంటి అనేక ఇతర అలైడ్, హెల్త్‌కేర్ సైన్స్ కోర్సులు కూడా ఇప్పుడు NCAHP నియంత్రణ కిందకు వస్తాయి. ముఖ్యంగా, NCAHP తన జాబితాలో 'సైకాలజిస్ట్', 'బిహేవియరల్ ఎనలిస్ట్', 'మెంటల్ హెల్త్ సపోర్ట్ వర్కర్స్' లాంటి ప్రొఫెషన్స్‌ను చేర్చటంతో యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

నిపుణుల నుంచి అభ్యంతరాలు..

సైకాలజీ డిగ్రీల రద్దుపై స్టేక్‌హోల్డర్స్‌ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. యూజీసీ డీఈబీకి ఈ నిర్ణయంపై అభ్యంతరాలు, ఫిర్యాదులతో కూడిన ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీనితో యూజీసీ ఉన్నతాధికారులు కేంద్ర విద్యాశాఖను సంప్రదించి ముఖ్యంగా బీఎస్సీ సైకాలజీ (ఆనర్స్) కోర్సులకు డిస్టెన్స్ మోడ్‌లో మినహాయింపు ఇవ్వాలని కోరారు.

అయితే విమర్శకులు ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. దిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (ఎస్​ఓఎల్​) మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ యూఎస్ పాండే లాంటి నిపుణులు, డిస్టెన్స్ సైకాలజీ కోర్సులు రెగ్యులర్ కాలేజీల్లోని కోర్సుల లాగే ఉన్నప్పుడు, వీటిని హెల్త్‌కేర్ ఫంక్షన్‌గా వేరుగా చూడాల్సిన రీజన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా, ఇలాంటి నియంత్రణ మార్పుల్లో ఇచ్చే గ్రేస్ పీరియడ్ కూడా లేకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఎన్​ఈపీ లక్ష్యాలను పట్టించుకోరా?

డీఈబీ డేటా ప్రకారం 2020-21లో 17 యూనివర్సిటీలు మాత్రమే ఓడీఎల్​ సైకాలజీ కోర్సులను అందించగా.. 2024-25 నాటికి ఆ సంఖ్య 57కు పెరిగింది. ఇందులో 36 స్టేట్ యూనివర్సిటీలు, 11 స్టేట్ ఓపెన్ యూనివర్సిటీలు, దిల్లీ యూనివర్సిటీ లాంటి రెండు సెంట్రల్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో 20, తమిళనాడులో 8 రాష్ట్ర యూనివర్సిటీలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీలో సైతం బీఏ కాంబినేషన్‌లో సైకాలజీ కోర్సు ఉంది. ఇంతటి ప్రముఖ కోర్సును హఠాత్తుగా ఆపడం జాతీయ విద్యా విధానం (ఎన్​ఈపీ) లక్ష్యాలకు విరుద్ధమని చాలామంది నిపుణులు అంటున్నారు. అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఎన్​ఈపీ లక్ష్యానికి ఈ నిర్ణయం అడ్డుగా మారుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం