న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) జూన్ 2025 పరీక్షకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. జూన్ 27న జరగనున్న పరీక్షల కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి ugcnet.nta.ac.in వెబ్‌సైట్ నుంచి తమ UGC NET అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దీనికి ముందు NTA జూన్ 25, జూన్ 26 పరీక్షల కోసం కూడా అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. జూన్ 27 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ ugcnet.nta.ac.in లో అందుబాటులో ఉంది.
UGC NET 2025 పరీక్షలు జూన్ 25 నుంచి 29 వరకు జరగనున్నాయి. మిగిలిన పరీక్షా తేదీల అడ్మిట్ కార్డులను తర్వాత విడుదల చేస్తారు. ఈ పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి.
అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి NTA ఇప్పటికే ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను కూడా విడుదల చేసింది. అడ్మిట్ కార్డుల్లో పరీక్షా కేంద్రం పూర్తి పేరు, చిరునామా ఉంటాయి.
పరీక్షా రోజున, అభ్యర్థులంతా తమ UGC NET అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ కాపీతో పాటు, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. అడ్మిట్ కార్డుపై ఇచ్చిన పరీక్షా సూచనలను పాటించడం ముఖ్యం.
ఒకవేళ అడ్మిట్ కార్డులో వ్యక్తిగత వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే, అభ్యర్థులు వెంటనే NTA హెల్ప్‌లైన్‌ను సంప్రదించి సమాచారం ఇవ్వాలి.