సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో 100 శాతం మార్కులు సాధించి టాపర్స్ లో ఒకరుగా నిలిచిన హర్యానాలోని పంచకులకు చెందిన సృష్టి శర్మ రోజుకు 17 నుంచి 18 గంటలు చదివేదాన్నని, ఒక్కో రోజు 20 గంటలు కూడా చదువుకున్న రోజులు ఉన్నాయని చెప్పింది. మరో టాపర్ మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన శంకరి కే జాధవ్ మాత్రం తాను తనకు చదవాలని అనిపించినప్పుడే చదివానని, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటానని చెప్పింది. ఈ ఇద్దరి ప్రిపరషన్ స్టైల్ ను చూద్దాం.
తాను ట్యూషన్ లేదా కోచింగ్ క్లాసులపై ఆధారపడలేదని, బదులుగా రోజుకు 17 నుండి 18 గంటలు,.కొన్నిసార్లు 20 గంటలు కూడా చదివానని సృష్టి శర్మ చెప్పారు. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబాన్ని, ఉపాధ్యాయులను గర్వపడేలా చేశాను. నేను ఎప్పుడూ ట్యూషన్ కు వెళ్లలేదు. రోజుకు 20 గంటలు చదివేదాన్ని. నేను ఆత్మవిశ్వాసం తక్కువ. నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ నాకు మద్దతు ఇచ్చారు. మా నాన్నే నాకు పెద్ద ఇన్స్పిరేషన్’’ అని సృష్టి శర్మ చెప్పారు. ప్రతీ పరీక్షలో బెస్ట్ ఇవ్వాలని కోరుకున్నానన్నారు. అందుకోసమే కష్టపడ్డానన్నారు. అయితే, 10వ తరగతిలో 20 గంటల పాటు చదవడంపై సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది. అంత కఠిన ప్రిపరేషన్ అవసరం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. మరికొందరు ఆ బాలిక తల్లిదండ్రులను కూడా విమర్శించారు.
సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఐదు సబ్జెక్టుల్లో 100 శాతం మార్కులు సాధించిన 15 ఏళ్ల శంకరీ కిశోర్ జాదవ్ తన ప్రిపరేషన్ గురించి వివరించారు. తన ప్రిపరేషన్ సాధారణంగానే సాగిందని, కాని ప్లాన్డ్ గా ప్రిపేర్ అయ్యానని వివరించారు. ‘‘ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించింది’’ అని తన ఫలితాలను చూసిన క్షణాన్ని వర్ణిస్తూ శంకరీ జాధవ్ గుర్తుచేసుకున్నారు. '100 అంటే నాకు చాలా ఎక్కువ. ఐదు సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు తెచ్చుకోవడం ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది’’ అన్నారు. సక్సెస్ కు మ్యాజిక్ ఫార్మూలా ఏదీ లేదని నాగ్ పూర్ లోని డీపీఎస్ మిహాన్ విద్యార్థి అయిన శంకరీ జాధవ్ అన్నారు. "సక్సెస్ కు షార్ట్ కట్ లేదు. ఇది కేవలం హార్డ్ వర్క్ మాత్రమే" అని ఆమె చెప్పారు. తాను కఠినమైన డైలీ టైమ్ టేబుల్ పెట్టుకోలేదని, గడియారంపై ఆధారపడి కాకుండా, నా మూడ్ పై, నా ప్రాధాన్యతలపై ఆధారపడి చదివానని వివరించారు.
గణితం తనకు అతిపెద్ద సవాలని, అదే సమయంలో తనకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టు కూడా అదేనని చెప్పారు. మ్యాథ్స్ ది, తనది "ప్రేమ-ద్వేష సంబంధం" అని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. "నేను ట్యూషన్ కు వెళ్లాను. కానీ ఎక్కువగా సందేహాలను నివృత్తి చేసుకోవడానికే వెళ్లేదానిని" అని చెప్పారు. కాన్సెప్ట్ లను అర్థం చేసుకోవడం ముఖ్యమని, ఆ పై స్వంత మాటల్లో రాయాలని సూచించారు. "మీ భాష బాగుంటే, కాన్సెప్ట్ మీకు అర్థమైతే, సిద్ధాంతం చాలా సులభం అవుతుంది" అని ఆమె సలహా ఇచ్చారు. "గణితం విషయానికి వస్తే మాత్రం, అంతా ప్రాక్టీస్ పైననే ఆధారపడి ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.
ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తాను యాక్టివ్ గానే ఉంటానని జాధవ్ చెప్పారు. "నేను చదువు కోసం డిజిటల్ ప్లాట్ఫామ్లను ఎప్పుడూ ఉపయోగించలేదు" అని ఆమె చెప్పింది. తను 10 వ తరగతిలో ఉండగానే తన తండ్రిని కోల్పోయానని వెల్లడించారు. ఆ విషాదం నుంచి బయటపడడానికి తనకు చాలా సమయం పట్టిందని తెలిపింది.
సంబంధిత కథనం