రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ షురూ అయింది. అర్హులైన అభ్యర్థులు… ఫీజు చెల్లించి, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీపీగెట్ పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
సీపీగెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై 17వ తేదీతో పూర్తవుతుంది. రూ. 500 ఆలస్య రుసుంతో జూలై 24వ తేదీ వరకు అప్లయ్ చేసుకునే వీలు ఉంటుంది. రూ. 2 వేలతో జూలై 28 వరకు ఛాన్స్ ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలో ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయి.
రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ - 2025 నిర్వహిస్తారు. ఇందుకు సబ్జెక్టుల వారీగా ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీనే సీపీగెట్ ప్రవేశ బాధ్యతలు చూస్తోంది.
టీజీ సీపీగెట్ లో భాగంగా పలు సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. నోటిఫికేషన్ తో పాటు సబ్జెక్టుల వారీగా వివరాల కోసం https://cpget.tgche.ac.in/ లేదా ఉస్మానియా యూనివర్శిటీ అధికారిక వెబ్ సైట్ ను చూడొచ్చు.