Toppers Tips : ఐఐటీ-జేఈఈ, క్లాట్, యూపీఎస్సీ టాపర్స్.. విద్యార్థులకు పరీక్షల కోసం ఇచ్చిన 8 చిట్కాలు
Toppers Tips : పరీక్షా పే చర్చా 2025 ప్రోగ్రామ్‌లో భాగంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐఐటీ-జేఈఈ, యూపీఎస్సీతోపాటుగా ఇతర పరీక్షల్లోని టాపర్స్ బోర్డు ఎగ్జామ్స్ 2025కు హాజరయ్యే విద్యార్థుల కోసం కొన్ని చిట్కాలు ఇచ్చారు. పరీక్షకు సన్నద్ధం కావడానికి సూచలను చేశారు.

పరీక్షా పే చర్చా 2025 కార్యక్రమంలో సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ, ఐఐటీ-జేఈఈ, యూపీఎస్సీ, ఎన్డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ) టాపర్, క్లాట్ టాపర్, గత ఏడాది పీపీసీలో హాజరైన అభ్యర్థులు.. బోర్డు ఎగ్జామ్ 2025కు హాజరయ్యే విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావడానికి చిట్కాలు ఇచ్చారు. అవేంటో చూద్దాం..
1. బి.నిష్ఠ (పీపీసీ యాంకర్, ఎంబీబీఎస్ స్టూడెంట్, మణిపూర్ యూనివర్సిటీ) పరీక్షలో పదేపదే అడిగే సబ్జెక్టును సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకూ సూచించారు. గత సంవత్సరం ప్రశ్నపత్రాన్ని చూసుకోవాలని చెప్పారు. ఏది ముఖ్యమో, ముందుగా దానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. అదే సమయంలో రివిజన్ చాలా ముఖ్యమని తెలిపారు.
2. పరీక్షకు సన్నద్ధం కావడానికి ప్రతి ఒక్కరి వ్యూహం భిన్నంగా ఉంటుంది. మీ ప్రిపరేషన్ కోసం మీ స్వంత పద్ధతిని కనుగొనండి అని క్లాట్ టాపర్ జై కుమార్ బోహ్రా చెప్పారు. ఇందుకోసం షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి.
3. ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఆశిష్ కుమార్ వర్మ మాట్లాడుతూ బోర్డు అడిగే విషయాలపై దృష్టి పెట్టాలని, సాధ్యమైనంత వరకు రాయడం ప్రాక్టీస్ చేయాలని అన్నారు. మంచి చేతిరాతతో వేగంగా రాయడానికి ప్రయత్నించండి.
4. ఐఎస్సీ టాపర్ 2024 సుచిష్మిత మాట్లాడుతూ కేవలం టాపిక్స్, ప్రశ్నలకు సమాధానాలు చదవడమే కాకుండా రాయండి. దీనివల్ల సమాధానం రాయడం ప్రాక్టీస్ చేస్తే పరీక్షలో బాగా రాస్తారు.
5. పరీక్షలు మీ మొత్తం జీవితం కాదని, అవి జీవితంలో ఒక భాగమని యూపీఎస్సీ టాపర్ ఏఐఆర్-1, 2022.. ఇషితా కిశోర్ అన్నారు. పరీక్ష కోసం 7 నుంచి 8 గంటలు చదవాలి. మీ హాబీస్ కోసం 2 నుండి 3 గంటలు కేటాయించండి. మంచి 8 గంటలు నిద్రపోండి.
6. సీబీఎస్ఈ టాపర్, 2022-23.. రాధిక సింఘాల్ మాట్లాడుతూ జీవితంలో అకడమిక్స్ చాలా ముఖ్యమని, అది మనల్ని మంచి కళాశాలకు నడిపిస్తుందన్నారు. అయితే పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొనడం చాలా ముఖ్యమని, ఇది మనకు మాట్లాడటానికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పారు. మన వ్యక్తిత్వ వికాసానికి సహాయపడుతుందని తెలిపారు.
7. వి.చిద్విలాస్ రెడ్డి, ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ఏఐఆర్-1, 2023 టాపర్ మాట్లాడుతూ.. చదువుతో పాటు, సంగీతం వినడం, క్రికెట్ లేదా ఇండోర్ గేమ్స్ ఆడటం వంటి మనకు ఇష్టమైన విషయాల కోసం విరామం తీసుకోవచ్చు. పరీక్షలు మన అభ్యసనను తనిఖీ చేయడానికి ఉద్దేశించినవి, నేర్చుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టండి.
8. క్లాట్ టాపర్ జై కుమార్ బోహ్రా మాట్లాడుతూ చదువు మధ్యలో చిన్న విరామం తీసుకోండి. ఒక గంట చదివిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల విరామం తీసుకోవాలి.
సంబంధిత కథనం