నూతన జాతీయ విద్యావిధానం ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఆస్ట్రేలియాలోని మూడు అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్ లను భారత్ లో ఏర్పాటు చేసుకునేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మంగళవారం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. దాంతో ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయం, విక్టోరియా విశ్వవిద్యాలయం మరియు లా ట్రోబ్ విశ్వవిద్యాలయాలకు భారత్ లో క్యాంపస్ లను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది.
వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయం గ్రేటర్ నోయిడాలో, విక్టోరియా విశ్వవిద్యాలయం నోయిడాలో, లా ట్రోబ్ విశ్వవిద్యాలయం బెంగళూరులో క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నాయి. 1989 లో స్థాపించబడిన వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయం సిడ్నీ అంతటా ఉన్న 13 క్యాంపస్ లలో 49 వేల మంది విద్యార్థులున్నారు. ఇది ఒక ప్రముఖ ప్రభుత్వ పరిశోధన విశ్వవిద్యాలయం.
డబ్ల్యూఎస్యు గ్రేటర్ నోయిడాలో బిఎ ఇన్ బిజినెస్ అనలిటిక్స్, బిఎ ఇన్ బిజినెస్ మార్కెటింగ్, ఎంబిఎ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు ఎంబిఎ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కోర్సులను అందించనుందని విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఆస్ట్రేలియాలో విక్టోరియా విశ్వవిద్యాలయాన్ని 1916 లో స్థాపించారు. ఇది చైనా, మలేషియా, శ్రీలంలకలో బలమైన ఆఫ్ షోర్ ఉనికిని కలిగి ఉంది. స్పోర్ట్స్ సైన్స్, వ్యాపారం మరియు ఐటిలో అనువర్తిత పరిశోధనలకు ప్రసిద్ది చెందింది. ఈ వర్సిటీ ప్రారంభించనున్న నోయిడా క్యాంపస్ లో బిజినెస్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందించనుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఎంబీఏ, మాస్టర్స్ ఇన్ ఐటీ ఉంటాయి.
లా ట్రోబ్ విశ్వవిద్యాలయాన్ని ఆస్ట్రేలియాలో 1964 లో ప్రారంభించారు. ఇది అనువర్తిత పరిశోధనలో, ముఖ్యంగా స్మార్ట్ సిటీలు, మాలిక్యులర్ సైన్సెస్, బయోటెక్ లో శ్రేష్టతకు గుర్తింపు పొందింది. బెంగళూరులోని లా ట్రోబ్ క్యాంపస్ లో బిజినెస్, కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ హెల్త్ లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 2023లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా రెగ్యులేషన్స్ కింద క్యాంపస్ల ఏర్పాటు, నిర్వహణను ప్రకటించింది.
సంబంధిత కథనం